ఇష్టారాజ్యంగా ‘ఎం-సెట్’
కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రైవేటు వైద్య కళాశాలల ఒంటెత్తు పోకడ
⇒ ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ పంపాలని విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌లు
⇒ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కావట్లేదని తల్లిదండ్రుల గగ్గోలు
⇒ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అడ్మిషన్ల వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు కౌన్సెలింగ్ ప్రక్రియలోనూ ఒంటెత్తు పోకడను ప్రదర్శిస్తున్నాయి.
ఎం-సెట్ ఫలితాల్లో ర్యాంకుల ఊసెత్తని యాజమాన్యాలు తాజాగా ఇంటర్ హాల్‌టికెట్ నంబర్లను ఈ నెల 22లోగా తమ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలంటూ విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ‘సాక్షి’కి చెప్పారు. అయితే ఎంత ప్రయత్నించినా వెబ్‌సైట్‌లో ఆ వివరాలు అప్‌లోడ్ కావట్లేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తండ్రి ఆరోపించారు. దీనిపై వెబ్‌సైట్‌లో పేర్కొన్న నంబర్‌కు ఫోన్ చేస్తే ‘ఇది ఒక క్లినికల్ సెంటర్. మాకు, ఎం-సెట్ పరీక్షకు సంబంధం లేదు’ అని సమాధానం వచ్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో రెండు రోజులే సమయం ఉందని... ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదని ఆందోళన చెందుతున్నారు. కాగా, ర్యాంకుల ప్రకటనకు ఇంటర్ వెయిటేజీ ఉండదంటూ చెప్పుకొచ్చిన యాజ మాన్యాలు తాజాగా హాల్ టికెట్ నంబర్ అడిగారంటే ఇంటర్ వెయిటేజీ ఉంటుందేమోనన్న చర్చ విద్యార్థుల్లో జరుగుతోంది. కానీ వెయిటేజీ ఉండదని ఆ మేరకు ప్రత్యేక ఎం-సెట్‌పై జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మరి ఎందుకు హాల్‌టికెట్ నంబర్ అడిగారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ఎం-సెట్‌పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలోకానీ... సచివాలయంలోని ముఖ్య కార్యదర్శి పేషీలోకానీ ప్రైవేటు ఎం-సెట్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటంలేదు. ప్రభుత్వం వారికి వత్తాసు పల కడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. 35 శాతం యాజమాన్య కోటా సీట్లను ఎం-సెట్ నిర్వహణకు ముందే కళాశాలల యాజమాన్యాలు ఒక్కోటీ రూ. కోటికిపైగా అమ్ముకొని వందల కోట్లు వెనకేసుకున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తడం తెలిసిందే.