12 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ ప్రకారం.. ఈ నెల 20వ తే దీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
ఆప్షన్లను మార్పుచేసుకునేందుకు 22, 23 తేదీల్లో అవకాశమిస్తున్నారు. 26న విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అడ్మిషన్ల కమిటీ గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై అడ్మిషన్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది.
ఏపీలో 34 హెల్ప్‌లైన్ సెంటర్లు
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కోసం గతంలో హైదరాబాద్‌లో నోడల్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు దీన్ని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. విద్యార్థులు ర్యాంకులు, హెల్ప్‌లైన్ సెంటర్లు, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, వెబ్ ఆప్షన్ల తేదీలు తదితర ముఖ్యమైన వివరాలకోసం http://apeamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ యథాతథం
ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులను గతేడాది మాదిరిగానే అమలు చేయనున్నారు. గతంలో రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన మేరకు ఈ ఫీజులుంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలోని విధానాన్నే అమలు చేయనున్నట్టు వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈసారి ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి చెల్లించనక్కర్లేకుండా నేరుగా కాలేజీల్లో అడ్మిషను పొందిన సమయంలోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గతంలో రూ.600 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.800కు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి.