సీఐ పదోన్నతుల్లో జాప్యం | CI postings... too late | Sakshi
Sakshi News home page

సీఐ పదోన్నతుల్లో జాప్యం

Published Tue, Oct 18 2016 9:49 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

సీఐ పదోన్నతుల్లో జాప్యం - Sakshi

సీఐ పదోన్నతుల్లో జాప్యం

* ఏలూరు రేంజిలో రెండు నెలల క్రితమే అమలులోకి
* గుంటూరు రేంజ్‌లో ఎటూ తేల్చని ఐజీ
* పదోన్నతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటున్న ఎస్సైలు
* సీనియారిటీలో వెనుకపడుతున్నామని ఆవేదన
 
సాక్షి, గుంటూరు: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే సామెత సీఐ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఎస్సైలకు సరిగ్గా సరిపోతుంది. గుంటూరు రేంజ్‌ పరిధిలో ఎస్సైలు పదోన్నతి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు పూర్తయినా ఇక్కడ మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. రేంజి పరిధిలోని గుంటూరు రూరల్, అర్బన్‌ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 16 మంది ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొందేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పదోన్నతుల్లో జరుగుతున్న జాప్యంపై సదరు ఎస్సైలు తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
25 రోజులుగా పెండింగ్‌...
పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పించేందుకు డీపీసీ (డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఎస్సైల సీనియారిటీ, వారిపై ఉన్న ఆరోపణలు, పనిష్మెంట్లు, వారి ప్రతిభ ఆధారంగా జాబితాను తయారు చేసి కౌంటర్‌ ఆర్డర్‌ కోసం ఆయా రేంజ్‌ల ఐజీలకు పంపారు. రాష్ట్రంలో వైజాగ్, కర్నూలు, ఏలూరు, గుంటూరు రేంజ్‌లు ఉండగా వైజాగ్, కర్నూలు రేంజిల్లో ఖాళీలు లేకపోవడంతో అక్కడి ఎస్సైలకు పదోన్నతులు కల్పించలేదు. గుంటూరు, ఏలూరు రేంజ్‌ల్లో మాత్రం ఎస్సైలకు పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ నిర్ణయం తీసుకుంది. ఏలూరు రేంజ్‌ పరిధిలో 42 మంది, గుంటూరు రేంజ్‌ పరిధిలో 16 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ నిర్ణయం తీసుకుని కౌంటర్‌ ఆర్డర్‌ ఇవ్వాలంటూ ఐజీలకు ఫైల్‌ పంపింది. ఏలూరు రేంజ్‌ పరిధిలో రెండు నెలల క్రితమే వీరందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏసీబీ వంటి విభాగాల్లో పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. గుంటూరు రేంజ్‌ పరిధిలో మాత్రం పదోన్నతుల ఫైల్‌ రేంజ్‌ ఐజీ ఎన్‌.సంజయ్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. తమతోపాటు పదోన్నతులు పొందిన ఏలూరు రేంజ్‌ ఎస్సైలంతా తమకంటే రెండు నెలలు ముందు సీఐలు అయ్యారని, భవిష్యత్తులో డీఎస్పీల పదోన్నతుల సమయంలో సీనియారిటీలో వారికంటే తాము వెనకబడతామని గుంటూరు రేంజి పరిధిలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
డీపీసీ నుంచి ఐజీకి ఫైల్‌ వచ్చి 25 రోజులు దాటుతున్నా దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పదోన్నతులు పొందిన 16 మంది ఎస్సైల నుంచి ఏయే విభాగాలకు పోస్టింగ్‌లు కావాలనే దానిపై అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఒకరిద్దరి పోస్టింగ్‌ల విషయంలో నెలకొన్న సందిగ్ధం వల్ల మిగతా వారందరికి పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రేంజ్‌ ఐజీ స్పందించి వెంటనే పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ వారు కోరుతున్నారు. 
 
త్వరలో పోస్టింగ్‌లు కేటాయిస్తాం..
గుంటూరు రేంజ్‌ పరిధిలో 16 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ డీపీసీ నుంచి ఫైల్‌ వచ్చింది. పదోన్నతులు పొందిన ఎస్సైల నుంచి అనుమతి పత్రాలు పొంది సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏసీబీ వంటి విభాగాలకు లేఖలు రాశాం. కొంతమంది ఏసీబీకి వెళ్లేందుకు అనుమతి కోరారు. ఏసీబీ ఉన్నతాధికారులు దీన్ని తిరస్కరించడంతో సమస్య తలెత్తింది. త్వరలో సమస్యలన్నీ తొలగించి పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– ఎన్‌.సంజయ్, గుంటూరు రేంజ్‌ ఐజీ 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement