సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ పోలీస్ శాఖలను ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిన ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. నోషనల్ సీనియారిటీ, పదోన్నతుల వ్యవహారం, ఇతర ప్రతిపాదనలకు సమస్యగా మారిన ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీ జాబి తాను రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు పూర్తి చేశాయి. ఎట్టకేలకు 2రోజుల క్రితం సీనియారిటీ జాబితాను పూర్తి స్థాయిలో సమీక్షించి పోలీస్‌శాఖ తుది జాబితాను విడుదల చేసింది.
1972 నుంచి 1996 వరకు..
ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు సీనియారిటీ జాబితా రూపొందించకుండా అడహక్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తూ రావడంతో సమస్య ఏర్పడింది. వాస్తవంగా ప్రతీ ఏటా ప్యానల్ ఇయర్‌కల్లా సీనియారిటీ జాబితా సిద్ధం చేసి అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. తీరా రాష్ట్ర విభజన సమయంలో జీవో నంబర్.54 పేరుతో తప్పులతడకగా రూపొందించిన సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. పదోన్నతుల్లో అన్యాయానికి గురైన అధికారులు హైకోర్టును ఆశ్రయించి సీనియారిటీ జాబితాపై సమీక్షకు ఆదేశాలు తెచ్చారు.
దీనిపై అప్పట్నుంచి మౌనంగా ఉన్న పోలీస్ శాఖ చివరికి పాత సీనియారిటీ జాబితాపై పూర్తిగా సమీక్షించి కొత్త జాబితాను విడుదల చేసింది. 1972 బ్యాచ్ ఎస్‌ఐగా ఎంపికైన వారి నుంచి 1996 వరకు పోలీస్ శాఖలోకి వచ్చిన అధికారుల జాబితా, వారి నోషనల్ సీనియారిటీ, పదోన్నతి పొందిన సంవత్సరం, సీనియారిటీ పోస్టులు అన్నింటిని సమీక్షించి తుది జాబితా అందుబాటులో పెట్టారు. ఇలా హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్‌ల్లో ఉన్న అధికారుల జాబితాను విడివిడిగా రూపొందించి సంబంధిత అధికారులు, రేంజ్ కార్యాలయాలకు పంపించారు. వీటిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు తెలపాలని పోలీస్ శాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది.
90 శాతం పరిష్కారం దొరికినట్లే..
సీనియారిటీ సమస్యకు సంబంధించి పూర్తి న్యాయం చేయడం కష్టమని, 100కు 90 శాతం మేర సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇంతకుమించి సీనియారిటీ సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని వెల్లడించారు. కన్వర్షన్, కన్వర్షన్ నుంచి వచ్చిన వారికి ఇచ్చిన పదోన్నతులు, అగ్జిలేటరీ పదోన్నతుల వల్ల మొదలైన సమస్య ఇంతకు మించి పరిష్కరించడం కుదరదని, రూపొందించిన సీనియారిటీ తుది జాబితాను హైకోర్టు ముందు పెడతామని, కోర్టు దిశానిర్దేశం ప్రకారం ముందుకెళ్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment