హైకోర్టు ఏర్పాటు అంత సులభం కాదు | The court is not so easy to set up | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఏర్పాటు అంత సులభం కాదు

Published Fri, Apr 10 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడమంటే పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసినంత సులభమైన పని కాదని ఉమ్మడి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.

  • హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య
  • సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడమంటే పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసినంత సులభమైన పని కాదని ఉమ్మడి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే హైకోర్టు ఏర్పాటు సాధ్యమవుతుందని తెలిపింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పేందుకు మరో వారం రోజుల గడువునివ్వాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) బి.నారాయణరెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

    గడువు పొడించే సమస్యే లేదని తేల్చిచెబుతూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. హైకోర్టు విభజన వ్యవహారంలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్‌బాబు, న్యాయవాది టి.అమర్‌నాథ్‌గౌడ్ వేర్వేరుగా దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.

    హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గతవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. దీనిని చీఫ్‌జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. గతవిచారణ సమయంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు నిధుల కేటాయింపు వివరాలు చెప్పేందుకు మరో వారం గడువివ్వాలన్న కేంద్రప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement