రాజ్యాంగ లక్ష్యాల్ని కాలరాసేలా వ్యవహరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. ఇక ప్రత్యేకాధికారుల నియామకం విషయానికొస్తే.. వీరి నియామకం రాజ్యాంగం లోని పార్ట్ 9 ప్రకారం చెల్లుబాటు కాదు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలపరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారులను నియమించడాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. ప్రత్యేకాధికారుల నియామకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చింది. ప్రత్యేకాధికారుల నియామకానికి ఉద్దేశించిన జీవో 90ని రద్దు చేసింది. అయితే ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేకాధికారులను కొనసాగించవచ్చునంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించ లేదని తెలిపింది. తమ ఆదేశాల మేరకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించడంకోసం రాష్ట్రంలో బీసీ జనాభా గణన, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అదే సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించే విషయంలో అవసరమైతే గవర్నర్ సాయం కూడా కోరవచ్చునని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం తీర్పు వెలువరించారు.
ఏజీ అభ్యంతరాలను పరిగణించని న్యాయస్థానం..
తీర్పు వెలువరించాక అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. మూడు నెలల కాలపరిమితి విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని నివేదించారు. అయితే ఏజీ నివేదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 1తో గడువు ముగిసిందని, అప్పట్లోపు ఎన్నికలకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ పని చేయకుండా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని, అలాగే ప్రత్యేకాధికారులను నియమిం చేందుకు ఉద్దేశించిన జీవో 90ని సవాలు చేస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి మాజీ సర్పంచ్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కలపల్లి మాజీ సర్పంచ్ రాయవరం శ్రీనివా సులరెడ్డి, మరో ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది రవి చీమలపాటి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం 41 పేజీల తీర్పు వెలువరించారు.
ప్రభుత్వం.. ఎన్నికల సంఘం విఫలమయ్యాయి...
‘‘పంచాయతీరాజ్ చట్టనిబంధనల ప్రకారం పంచాయతీల కాలపరిమితి ఐదేళ్లు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 1తో ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకుగాను బీసీ జనాభా గణన, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ ప్రభుత్వం బీసీ జనాభా గణనకు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఖరారుకు చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సంఘమూ దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఏ రకంగా చూసుకున్నా అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాయి.’’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
సహకరించనప్పుడు ఎన్నికల సంఘం హైకోర్టుకు రావాల్సింది...
‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు. అధికరణ 243కె క్లాజ్ 3 ప్రకారం ఎన్నికల కమిషన్ కోరినప్పుడు గవర్నర్ ఎన్నికల నిర్వహణ నిమిత్తం తన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఐదేళ్ల కాలపరిమితి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే ఎన్నికల నిర్వహణ నుంచి మినహాయింపు కోరవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రాష్ట్రంలో పంచాయతీల గడువు ముగిసేనాటికి అటువంటి పరిస్థితులేమీ లేవు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోలేదు కాబట్టే ఎన్నికలు జరగలేదు. హైకోర్టులో పిటిషన్ వేసి.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరి ఉండొచ్చు. కానీ ఎన్నికల సంఘం ఆ పని చేయలేదు’’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగ లక్ష్యాలను కాలరాసేందుకు అనుమతించేది లేదు...
‘‘1–8–2018 కల్లా ఎన్నికలు నిర్వహించకపోవడానికి ప్రభుత్వం వద్ద సహేతుక కారణం లేదు. న్యాయపరంగా ఆమోదయోగ్యమైన కారణమూ లేదు. కాలపరిమితి ముగిసేలోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకం. ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీలను నిర్వీర్యం చేయడమంటే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. రాజ్యాంగ లక్ష్యాల్ని కాలరాసేలా వ్యవహరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. ఇక ప్రత్యేకాధికారుల నియామకం విషయానికొస్తే.. వీరి నియామకం రాజ్యాంగంలోని పార్ట్ 9 ప్రకారం చెల్లుబాటు కాదు. ఐదేళ్ల కాలపరిమితిలోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ పని చేయకుండా ప్రత్యేకాధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమే కాదు.. రాజ్యాంగ విరుద్ధం కూడా. కాబట్టి ప్రత్యేకాధికారుల నియామకం కోసం జారీ చేసిన జీవో 90.. తదనుగుణంగా జారీ అయిన మెమో రాజ్యాంగంలోని అధికరణ 14, 243ఈ(3)లకు విరుద్ధం’’ అని జస్టిస్ రామచంద్రరావు స్పష్టీకరించారు. మూడు నెలల వరకు ప్రత్యేకాధికారులు కొనసాగవచ్చునని, అప్పటిలోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
‘హైకోర్టు తీర్పును వెంటనే అమలు పరచాలి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పంచాయతీలకు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తెస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
‘వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి’
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను రద్దు చేసి 90 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గౌరవించి వెంటనే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలుపెట్టాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పు శుభ పరిణామమని పరిషత్ జాతీయ కార్యదర్శి జాష్టి వీరాంజనేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment