- పలువురి పేర్లు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. తొలి దశలో పలువురి పేర్లను న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సిఫార్సు చేసింది. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్‌లతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల నుంచి ఆరుగురి పేర్లను, జిల్లా జడ్జీల నుంచి ఐదుగురి పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పదవులకు సుప్రీంకోర్టుకు హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి సిఫార్సు చేసిన వారిలో టి.అమర్‌నాథ్‌గౌడ్, పి.కేశవరావు, అభినంద్ కుమార్ షావలి, ఎం.గంగారావు, డి.వి.ఎస్.సోమయాజులు, కె.విజయలక్ష్మి ఉన్నారు. వీరిలో డి.వి.ఎస్.సోమయాజులు మినహా మిగిలిన వారందరూ ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. డీవీఎస్ సోమయాజులు విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఓ జిల్లా న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక జిల్లా జడ్జీల నుంచి జె.ఉమాదేవి, జి.శ్యాంప్రసాద్, ఎన్.బాలయోగి, టి.రజనీ, షమీమ్ అక్తర్‌ల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు కొలీజియం సిఫార్సు చేసింది. ఉమాదేవి ప్రస్తుతం హైదరాబాద్, స్మాల్ కాజెస్‌కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. శ్యాంప్రసాద్ ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా, బాలయోగి హైదరాబాద్, సిటీ సివిల్‌కోర్టు చీఫ్ జడ్జిగా, రజనీ హైదరాబాద్, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, షమీమ్ అక్తర్ హైకోర్టు రిజిష్ట్రార్ (జుడీషియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సహా 26 మంది జడ్జీలున్నాయి. ఈనెల 10 తరువాత జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావు పదవీ విరమణ చేయనుండటంతో ఖాళీల సంఖ్య 38కి పెరగనుంది.
ఖాళీల భర్తీకి హైకోర్టు శ్రీకారం
Published Wed, May 4 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement