సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోటా కింద వృత్తి విద్యా కోర్సుల్లో ఈ ఏడాది ప్రవేశాలు జరపరాదని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయని.. ఆ కోటా జీవోను రద్దు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను టి.శ్రియతో పాటు మరో నలుగురు సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా తమ వాదనతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. ‘వృత్తి విద్యా కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్ని ఈ ఏడాదికి నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయం బాధాకరమే అయినా విస్తృత అంశాలతో ముడిపడినందున ఆదేశాలు ఇస్తున్నాం. గతేడాది స్పోర్ట్స్ కోటా ప్రవేశాలపై స్టే విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినా.. అది గత విద్యా సంవత్సరానికే పరిమితం. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు. ఇందులో అక్రమాలకు తెర లేస్తున్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకుని ఉండవు’అని కోర్టు వ్యాఖ్యానించింది.
నీట్ నోటిఫికేషన్ తర్వాత జీవోనా?
విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. ‘క్రీడా కోటా కింద 2017–18 విద్యా సంవత్సరంలో జరిగిన ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఎం విచారణ ఆదేశాల ఫలితంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేపట్టింది. లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డిప్యూటీ డైరెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అప్పటికే క్రీడా కోటాపై ఉన్న కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జీవో 7జారీ అయింది. అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అలాంటి అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన జీవో 7ను అమలు చేయడం అన్యాయం’అని అన్నారు. పైగా, నీట్ నోటిఫికేషన్ వెలువడ్డాక జీవో వచ్చిందని.. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశాలున్నాయని చెప్పారు. దేశంలో ఎప్పుడూ వినని క్రీడలను జీవో ద్వారా ప్రభుత్వం గుర్తించిందని.. స్పోర్ట్స్ కోటాలో సీటు పొందిన విద్యార్థి ఏ ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పతకమైనా సాధించలేదని ఆమె వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. స్పోర్ట్స్ కోటాను ఈ ఏడాది రద్దు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల్లో నో స్పోర్ట్స్ కోటా
Published Sat, Jul 7 2018 1:32 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment