సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాల పరిశీలనకు ఓ కమిటీ, ఉద్యోగుల విభజనకు ఓ కమిటీ, అలాగే రికార్డుల డిజిటలైజేషన్ కోసం మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఐదుగురికి స్థానం కల్పించారు. హైకోర్టు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల రూపకల్పన కమిటీకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వం వహిస్తారు.
ఈ కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ అంబటి శంకర నారాయణ, జస్టిస్ షమీమ్ అక్తర్ ఉన్నారు. భవనాల పరిశీలన కమిటీకి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక రికార్డుల డిజిటలైజేషన్ పర్యవేక్షణ కమిటీకి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వం వహిస్తారు. ఇందులో జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు ఉన్నారు.
ఏపీకి ఆప్షన్ ఇచ్చిన వారి నుంచే భవనాల పరిశీలన కమిటీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన న్యాయ మూర్తుల నుంచే (జస్టిస్ రామసుబ్రమణియన్ మినహా) కొందరికి భవనాల పరిశీలన కమిటీలో స్థానం కల్పించారు. కాగా, ఫిబ్రవరి మొదటి వారంలో భవనాల పరిశీలన కమిటీ అమరావతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న కొన్ని భవనాలను హైకోర్టు కోసం ఏపీ ప్రభుత్వ వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. విస్తీర్ణంలో పెద్దవిగా ఉండటంతో పాటు దాదాపు 1,000 కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం ఉండడం వల్లే ఈ భవనాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులకు నివాస ఏర్పాట్ల కోసం నాగార్జున యూనివర్సిటీకి సమీపంలోనే కొన్ని భవనాలను గుర్తించినట్లు సమాచారం. అలాగే కంచికచర్ల వద్ద కూడా ఓ భారీ భవనాన్ని హైకోర్టు ఏర్పాటు కోసం గుర్తించారు. వీటితో పాటు వేరే చోట మరో రెండు భవనాలను కూడా కమిటీ పరిశీలనకు సిద్ధం చేస్తున్నారు.
ఫుల్ కోర్టు ముందుకు భవనాలపై నివేదిక
ఈ భవనాలను పరిశీలించిన తరువాత కమిటీ ఓ నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదికను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందుంచుతారు. ఈ సమావేశంలో భవనాల ఎంపిక జరిగిన తరువాత వాటిల్లో మార్పులు, చేర్పులను సూచిస్తారు. ఈ మార్పులను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసిన తరువాత భవనాల కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. కమిటీ పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తే, అప్పటి నుంచి అమరావతికి ఏపీ హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ లోపు ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment