రిజిస్ట్రార్‌ జనరల్‌కి బెదిరింపులు | Threats to the Registrar General | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్‌ జనరల్‌కి బెదిరింపులు

Published Tue, Sep 18 2018 2:26 AM | Last Updated on Tue, Sep 18 2018 2:26 AM

Threats to the Registrar General - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ను బెదిరించి, దూషించిన వ్యవహారంలో హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌.లక్ష్మీనర్సింహాచార్యులు (ఆర్‌ఎల్‌ఎన్‌ చార్యులు)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ పరిపాలనాపరంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్‌ఎల్‌ఎన్‌ చార్యులపై హైకోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చార్యులుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా జడ్జి అయిన మానవేంద్రనాథ్‌ రాయ్‌ డిప్యుటేషన్‌పై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జడ్జీల క్వార్టర్స్‌లో నివాసముంటున్న మానవేంద్రనాథ్‌ రాయ్‌ విధి నిర్వహణలో సూటిగా, కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఈనెల 2వ తేదీ అర్థరాత్రి ఆయనకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి ఆయనను తీవ్రంగా దూషించారు. ఎవరని రాయ్‌ ప్రశ్నించేలోపే కాల్‌ కట్‌ అయింది.

తిరిగి మరుసటి రోజుకూడా ల్యాండ్‌ఫోన్‌కు ఆ వ్యక్తి ఇదేవిధంగా ఫోన్‌ చేసి దూషించడమే కాక, బెదిరింపులకు సైతం దిగాడు. దీంతో రాయ్‌ తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌ గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆ నెంబర్‌ హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌ఎల్‌ఎన్‌ చార్యులదని తేల్చారు. ఇదే విషయాన్ని వారు రాయ్‌కి తెలియజేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాధాకృష్ణన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీజే, చార్యులును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనపై ఫిర్యాదుకు ఆదేశాలిచ్చారు. దీంతో దిగొచ్చిన చార్యులు అటు మౌఖికంగా, ఇటు రాతపూర్వకంగా మానవేంద్రనాథ్‌కి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా సీజే ఆదేశాల మేరకు చార్యులుపై హైకోర్టు అధికారులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, వివాదాస్పదుడిగా చార్యులుకు హైకోర్టులో పేరుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement