Manavendranath Roy
-
ఘటనా స్థలంలో లేనంత మాత్రాన..
సాక్షి, అమరావతి: నిందితుడు ఘటనా స్థలంలో లేనంత మాత్రాన అతడు నేర బాధ్యత నుంచి తప్పించుకోజాలడని హైకోర్టు స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో లేరన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎర్ర చందనం అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితునికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలివీ.. శ్రీసిటీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ ట్రాక్టర్ నుంచి ఎర్ర చందనం దుంగల్ని దిగుమతి చేస్తున్న ఆరుగురు వ్యక్తులు పోలీసుల్ని చూసి వాళ్లపై రాళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు ఎర్ర చందనం దుంగల్ని జప్తు చేసి వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఎర్ర చందనం దుంగలు చిత్తూరు జిల్లా మతేరిమిట్ట గ్రామానికి చెందిన కె.శిబి చక్రవర్తికి చెందినవని, తాము ట్రాక్టర్లో వాటిని తెస్తుంటే శిబి చక్రవర్తి మోటార్ బైక్‌పై వెళుతూ వాటిని దించాల్సిన చోటు చూపించాడని చెప్పారు. ఎక్కడ దించాలో చూపి శిబి చక్రవర్తి వెళ్లిపోయారని వివరించారు. దీంతో పోలీసులు శిబి చక్రవర్తిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శిబి చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అతడు ఘటనా స్థలంలో లేడని, మిగిలిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్‌ను నిందితునిగా చేర్చారన్నారు. పోలీసులు కావాలనే ఈ కేసులో అతడిని ఇరికించారన్నారు. ఈ వాదనల్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు. ఎర్ర చందనం దుంగలు రవాణా చేస్తున్న ట్రాక్టర్ పిటిషనర్దేనని తెలిపారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో అతడే ప్రధాన వ్యక్తి అని, ఘటనా స్థలంలో లేడన్న కారణంతో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రాయ్ నిందితుడికి బెయిల్ నిరాకరించారు. -
ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరిస్తే అప్పీలే
సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేస్తే, ఆ ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అప్పీల్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై క్రిమినల్ పిటిషన్ దాఖలుకు వీల్లేదని, దానికి విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. మావోయిస్టు సానుభూతిపరుడు పంగి నాగన్న దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను కొట్టేసింది. ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంతో విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పంగి నాగన్నను 2020లో అరెస్ట్ చేశారు. తర్వాత కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. నాగన్నపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో నాగన్న విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నాగన్న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. ఈ పిటిషన్ విచారణార్హతపై ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ అభ్యంతరం తెలిపారు. ఎన్ఐఏ చట్టం సెక్షన్ 21(4) కింద నిందితుల బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేస్తే, దానిపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలే తప్ప, క్రిమినల్ పిటిషన్ దాఖలుకు వీల్లేదన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. నాగన్న పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దానిని కొట్టేశారు. -
నిరాధార ఆరోపణలతో బెయిల్ రద్దు కుదరదు
సాక్షి, అమరావతి: నిందితులపై వచ్చే అస్పష్ట ఆరోపణల ఆధారంగా వారికిచ్చిన బెయిల్‌ను రద్దుచేయడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆరోపణలకు ఆధారాలు లేనప్పుడు బెయిల్ రద్దుచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గత ఏడాది జూన్‌లో జరిగిన జంటహత్య కేసులో నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ మృతుల్లో ఒకరైన ప్రతాపరెడ్డి సతీమణి లక్ష్మీదేవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ జంటహత్య కేసులో చార్జిషీట్ దాఖలు చేసేవరకు నిందితులు పెసరవాయి గ్రామంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పు చెప్పారు. పెసరవాయిలో గత ఏడాది జూన్ 17న టీడీపీ నేతలైన వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షలతో జరిగిన ఈ హత్యలపై దర్యాప్తు జరిపిన గడివేముల పోలీసులు నిందితులు ద్వారం శ్రీకాంత్‌రెడ్డి, ద్వారం కేదారనాథ్రెడ్డిలతో పాటు మరికొందరిని అదేనెల 25న అరెస్ట్ చేశారు. అనంతరం వీరు నంద్యాల కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు వేసుకున్నారు. రెండుసార్లు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన కోర్టు మూడోసారి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిందితులు విడుదలయ్యారు. నిందితుల బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ మృతుడు ప్రతాప్‌రెడ్డి సతీమణి లక్ష్మీదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారించారు. సాక్షులను బెదిరిస్తూ, దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నందున నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని పిటిషనర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు లేదు పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లె దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితులు పెసరవాయిలోకి అడుగుపెట్టరాదన్న కోర్టు బెయిల్ షరతును వారు పాటిస్తున్నట్లు చెప్పారు. నిందితులు బెదిరిస్తున్నట్లు ఒక్క సాక్షి నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు. నిందితుల న్యాయవాదులు కూడా పిటిషనర్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలకు ఆధారాలు చూపనందున బెయిల్‌ను రద్దుచేయడం సాధ్యం కాదని తీర్పు చెప్పారు. -
కేసులేవీ లేనప్పుడు రౌడీషీట్ మూసివేయాల్సిందే
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత.. ఆ వ్యక్తిపై మరే ఇతర కేసులు లేనప్పుడు రౌడీషీట్ కొనసాగించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మర్రి గోపి అనే వ్యక్తిపై రౌడీషీట్ కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ, వెంటనే అతనిపై రౌడీషీట్‌ను మూసివేయాలని గుంటూరు జిల్లా, మంగళగిరి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పునిచ్చారు. పోలీసులు తనపై రౌడీషీట్ తెరవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన మర్రి గోపి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కాలవ సురేశ్ కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ..2011లో పిటిషనర్‌పై హత్యానేరం కింద కేసు నమోదైందని, మంగళగిరి కోర్టు 2014లో పిటిషనర్‌పై కేసును కొట్టివేసిందన్నారు. అతనిపై మరో కేసు ఏదీ పెండింగ్‌లో లేదని, కేసు నమోదయినప్పుడు పోలీసులు పిటిషనర్‌పై రౌడీషీట్ తెరిచారని, కేసు కొట్టేసిన తరువాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పునిస్తూ పిటిషనర్ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిరూపించేందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్‌పై రౌడీషీట్ కొనసాగించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పారు. కోర్టు కొట్టేసిన కేసు ఆధారంగా రౌడీషీట్ కొనసాగించడం సమర్థనీయం కాదని, అతడిపై రౌడీషీట్‌ను మూసివేయాలని పోలీసులను ఆదేశించారు. -
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ గురువారం వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మొదట వీరి నియామకాలకు సంబంధించి అటు రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులు, ఇటు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లను రిజిస్ట్రార్ బి.రాజశేఖర్ చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యశ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కేసులను విచారించగా.. జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కలిసి జస్టిస్ వెంకటరమణ కేసులను విచారించారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి తాత చీకటి పరశురాంనాయుడు విజయనగరం జిల్లాలో రైతు నాయకుడు, న్యాయవాది కూడా. 1980 దశలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మానవేంద్రనాథ్‌రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి ఆరో తేదీ వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, అనంతరం విశాఖపట్నం 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా, 2006 నుంచి 2009 ఏప్రిల్ వరకూ హైదరాబాద్ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, 2009 నుంచి 2012 వరకు విశాఖ జిల్లా జడ్జిగా, 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ 30 వరకు ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో కీలక పాత్ర పోషించారు. జస్టిస్ వెంకటరమణ నేపథ్యం అనంతపురం జిల్లా, గుత్తి స్వస్థలం. ఆయన తండ్రి ఎం.నారాయణరావు. న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. 1982లో వెంకటరమణ న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యాక తండ్రి వద్దే మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత సీనియర్ న్యాయవాది జయరాం వద్ద న్యాయవాదిగా రాటుదేలారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబా ద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా వ్యవహరిం చారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు ప్రధాన జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. -
రిజిస్ట్రార్ జనరల్‌కి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ను బెదిరించి, దూషించిన వ్యవహారంలో హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్.లక్ష్మీనర్సింహాచార్యులు (ఆర్ఎల్ఎన్ చార్యులు)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ పరిపాలనాపరంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్ఎల్ఎన్ చార్యులపై హైకోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చార్యులుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా జడ్జి అయిన మానవేంద్రనాథ్ రాయ్ డిప్యుటేషన్‌పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జడ్జీల క్వార్టర్స్‌లో నివాసముంటున్న మానవేంద్రనాథ్ రాయ్ విధి నిర్వహణలో సూటిగా, కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఈనెల 2వ తేదీ అర్థరాత్రి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఆయనను తీవ్రంగా దూషించారు. ఎవరని రాయ్ ప్రశ్నించేలోపే కాల్ కట్ అయింది. తిరిగి మరుసటి రోజుకూడా ల్యాండ్‌ఫోన్‌కు ఆ వ్యక్తి ఇదేవిధంగా ఫోన్ చేసి దూషించడమే కాక, బెదిరింపులకు సైతం దిగాడు. దీంతో రాయ్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్ గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆ నెంబర్ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్ఎల్ఎన్ చార్యులదని తేల్చారు. ఇదే విషయాన్ని వారు రాయ్‌కి తెలియజేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీజే, చార్యులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనపై ఫిర్యాదుకు ఆదేశాలిచ్చారు. దీంతో దిగొచ్చిన చార్యులు అటు మౌఖికంగా, ఇటు రాతపూర్వకంగా మానవేంద్రనాథ్కి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా సీజే ఆదేశాల మేరకు చార్యులుపై హైకోర్టు అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, వివాదాస్పదుడిగా చార్యులుకు హైకోర్టులో పేరుంది. -
పలువురు జిల్లా జడ్జీల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల చైర్మన్లుగా పనిచేస్తున్న పలువురు జిల్లా జడ్జీలను ఉమ్మడి హైకోర్టు బదిలీ చేసింది. ఈ మేరకు రిజిష్ట్రార్ జనరల్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► హైదరాబాద్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ నిర్మల దయావతి ఆదిలాబాద్ ఫ్యామిలీ కోర్ట్ కమ్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. ► నిజామాబాద్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మహ్మద్ నూరుల్లా ఘోరీ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కమ్ 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జీగా బదిలీ అయ్యారు. ► రంగారెడ్డి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ సాంబశివరావు నాయుడు కరీంనగర్ జిల్లా గోదావరి ఖని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్ట్ ప్రిసైడింగ్ అధికారిగా నియమితులయ్యారు. ► వరంగల్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి.రమణరావు మహబూబాబాద్ 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. ► అనంతపురం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ కె.వి.మహాలక్ష్మి అదే జిల్లా మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ► తూర్పుగోదావరి శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎన్.మాల్యాద్రి కాకినాడ 3వ అదనపుజిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ► కడప శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వి.అప్పారావు గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులయ్యారు. ► మచిలీపట్నం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎస్.రజనీ అదే ప్రాంత ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా, 10వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. ► ఒంగోలు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ బి.వి.నాగేంద్రరావు అనకాపల్లి 10 అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. ► శ్రీకాకుళం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ కర్నూలు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. -
ఫిబ్రవరి 2న హైకోర్టుకు సెలవు
హైదరాబాద్ : ఫిబ్రవరి 2న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను పురస్కరించుకుని ఉమ్మడి హైకోర్టుతో పాటు హైదరాబాద్‌లోని ట్రిబ్యునళ్లు, ఇతర సంస్థలు వాటి కార్యాలయాలకు హైకోర్టు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 2న సెలవులు ప్రకటించినందున ఈ ఏడాది ఆగస్టు 27(శనివారం) రోజు కోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.