కేసులేవీ లేనప్పుడు రౌడీషీట్‌ మూసివేయాల్సిందే | Judgment of High Court Judge Justice Manavendranath Roy | Sakshi
Sakshi News home page

కేసులేవీ లేనప్పుడు రౌడీషీట్‌ మూసివేయాల్సిందే

Published Thu, Jan 27 2022 5:36 AM | Last Updated on Thu, Jan 27 2022 5:36 AM

Judgment of High Court Judge Justice Manavendranath Roy - Sakshi

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత.. ఆ వ్యక్తిపై మరే ఇతర కేసులు లేనప్పుడు రౌడీషీట్‌ కొనసాగించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.  మర్రి గోపి అనే వ్యక్తిపై రౌడీషీట్‌ కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ, వెంటనే అతనిపై రౌడీషీట్‌ను మూసివేయాలని గుంటూరు జిల్లా, మంగళగిరి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల తీర్పునిచ్చారు. పోలీసులు తనపై రౌడీషీట్‌ తెరవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన మర్రి గోపి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కాలవ సురేశ్‌ కుమార్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ..2011లో పిటిషనర్‌పై హత్యానేరం కింద కేసు నమోదైందని, మంగళగిరి కోర్టు 2014లో పిటిషనర్‌పై కేసును కొట్టివేసిందన్నారు. అతనిపై మరో కేసు ఏదీ పెండింగ్‌లో లేదని, కేసు నమోదయినప్పుడు పోలీసులు పిటిషనర్‌పై రౌడీషీట్‌ తెరిచారని, కేసు కొట్టేసిన తరువాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారని కోర్టుకు నివేదించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పునిస్తూ పిటిషనర్‌ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిరూపించేందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్‌పై రౌడీషీట్‌ కొనసాగించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పారు. కోర్టు కొట్టేసిన కేసు ఆధారంగా రౌడీషీట్‌ కొనసాగించడం సమర్థనీయం కాదని, అతడిపై రౌడీషీట్‌ను మూసివేయాలని పోలీసులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement