
జస్టిస్ వెంకటరమణతో ప్రమాణం చేయిస్తున్న ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌తో ప్రమాణం చేయిస్తున్న ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ గురువారం వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మొదట వీరి నియామకాలకు సంబంధించి అటు రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులు, ఇటు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లను రిజిస్ట్రార్ బి.రాజశేఖర్ చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యశ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కేసులను విచారించగా.. జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కలిసి జస్టిస్ వెంకటరమణ కేసులను విచారించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి తాత చీకటి పరశురాంనాయుడు విజయనగరం జిల్లాలో రైతు నాయకుడు, న్యాయవాది కూడా. 1980 దశలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మానవేంద్రనాథ్‌రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి ఆరో తేదీ వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, అనంతరం విశాఖపట్నం 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా, 2006 నుంచి 2009 ఏప్రిల్ వరకూ హైదరాబాద్ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, 2009 నుంచి 2012 వరకు విశాఖ జిల్లా జడ్జిగా, 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ 30 వరకు ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో కీలక పాత్ర పోషించారు.
జస్టిస్ వెంకటరమణ నేపథ్యం
అనంతపురం జిల్లా, గుత్తి స్వస్థలం. ఆయన తండ్రి ఎం.నారాయణరావు. న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. 1982లో వెంకటరమణ న్యాయ వాదిగా ఎన్‌రోల్ అయ్యాక తండ్రి వద్దే మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత సీనియర్ న్యాయవాది జయరాం వద్ద న్యాయవాదిగా రాటుదేలారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబా ద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా వ్యవహరిం చారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు ప్రధాన జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.