Judges sworn
-
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు. బుధవారం హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు ఇరువురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మంతోజు గంగారావు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
AP High Court: ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కాగా, వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఈ ప్రమాణ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 9 మంది న్యాయమూర్తులు రేపు( మంగళవారం) ఉదయం 10.30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ జస్టిస్ ఎన్వీ రమణ.. కొత్త న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. కొత్తగా 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘెష్ -
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ గురువారం వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మొదట వీరి నియామకాలకు సంబంధించి అటు రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులు, ఇటు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లను రిజిస్ట్రార్ బి.రాజశేఖర్ చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యశ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కేసులను విచారించగా.. జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కలిసి జస్టిస్ వెంకటరమణ కేసులను విచారించారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి తాత చీకటి పరశురాంనాయుడు విజయనగరం జిల్లాలో రైతు నాయకుడు, న్యాయవాది కూడా. 1980 దశలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మానవేంద్రనాథ్‌రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి ఆరో తేదీ వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, అనంతరం విశాఖపట్నం 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా, 2006 నుంచి 2009 ఏప్రిల్ వరకూ హైదరాబాద్ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, 2009 నుంచి 2012 వరకు విశాఖ జిల్లా జడ్జిగా, 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ 30 వరకు ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో కీలక పాత్ర పోషించారు. జస్టిస్ వెంకటరమణ నేపథ్యం అనంతపురం జిల్లా, గుత్తి స్వస్థలం. ఆయన తండ్రి ఎం.నారాయణరావు. న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. 1982లో వెంకటరమణ న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యాక తండ్రి వద్దే మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత సీనియర్ న్యాయవాది జయరాం వద్ద న్యాయవాదిగా రాటుదేలారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబా ద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా వ్యవహరిం చారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు ప్రధాన జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. -
సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణం
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ సమక్షంలో వారు సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ వన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం ఉన్న జడ్జీల సంఖ్య 28కి చేరింది. గతంలో జస్టిస్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన జడ్జీలుగా ఉన్నారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి రాజస్తాన్‌లో 1958లో జన్మించిన దినేశ్ మహేశ్వరి 1980లో జోథ్‌పూర్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో లాయర్గాపేరు నమోదు చేయించుకున్నారు. 2004లో రాజస్తాన్ హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. 2014లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2016లో మేఘాలయ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టు సీజేగా ఉన్నారు. పౌర, రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులను ఆయన ఎక్కువగా విచారించారు. ప్రతీకారం తీర్చుకునేందుకు, అధికారుల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దుర్వినియోగం చేయడం తగదని 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960లో ఢిల్లీలో జన్మిం చారు. ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ అందుకున్న ఆయన 1983లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జీగా, అనంతరం 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఖన్నా తదుపరి సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జస్టిస్ ఖన్నా లాయర్‌గా ఉన్న సమయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం–1986కు సంబంధించి వైద్యంలో నిర్లక్ష్యం, కంపెనీ చట్టాలపై పలు కేసులను వాదించారు. అదేవిధంగా, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా కూడా ఉన్నారు. అప్పటి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ఎండగట్టిన ఈ ధర్మాసనానికి అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించడం విశేషం. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సుభాష్‌రెడ్డితోపాటు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ అజయ్ రస్తోగీలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో కేసులను విచారించారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుభాష్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ఈ నెల 29న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, అలాగే డిసెంబర్ 30న జస్టిస్ మదన్ బి.లోకూర్‌లు పదవీ విరమణ చేయనున్నారు. -
హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం
హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది బుధవారం ప్రమాణం చేశారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. -
జడ్జీలకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎం.ఎస్.కె. జైస్వాల్‌కు మంగళవారం జిల్లా కోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు. జిల్లా న్యాయమూర్తిగా సేవలందించిన హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం తనకు తీపిగుర్తు అని, రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు మార్గదర్శకమని జైస్వాల్ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా వృత్తిధర్మాన్ని కొనసాగించానని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడం సంతోషాన్ని కలిగిస్తున్నా జిల్లా కోర్టును వదిలి వెళ్తున్నందుకు కొంత బాధగా ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, పలువురు జడ్జీలు, ప్రిపైడింగ్ అధికారులు, బార్ కౌన్సిల్ సభ్యులు, పలువురు న్యాయవాదులు కార్యక్రవుంలో పాల్గొన్నారు. పలువురి రిలీవ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సీతారామమూర్తి, ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్మన్ శివశంకర్‌లు మంగళవారం రిలీవ్ అయ్యారు. బుధవారం వీరు హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయస్థానానికి ఇన్‌ఛార్జ్‌గా సీబీఐ రెండో అదనపు కోర్టు జడ్జి ఎంవీ రమేష్ నియమితులయ్యారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న మొదటి కోర్టుకు కూడా రమేష్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది బుధవారం ఉదయం ప్రమాణం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే వారిలో ఉన్నారు.