సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణం | Justices Dinesh Maheshwari, Sanjiv Khanna sworn-in as SC judges | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణం

Published Sat, Jan 19 2019 3:26 AM | Last Updated on Sat, Jan 19 2019 3:26 AM

 Justices Dinesh Maheshwari, Sanjiv Khanna sworn-in as SC judges - Sakshi

జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

న్యూఢిల్లీ: జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సమక్షంలో వారు సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్‌ వన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం ఉన్న జడ్జీల సంఖ్య 28కి చేరింది. గతంలో జస్టిస్‌ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్‌ ఖన్నా ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన జడ్జీలుగా ఉన్నారు.

జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి
రాజస్తాన్‌లో 1958లో జన్మించిన దినేశ్‌ మహేశ్వరి 1980లో జోథ్‌పూర్‌ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో లాయర్‌గాపేరు నమోదు చేయించుకున్నారు. 2004లో రాజస్తాన్‌ హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. 2014లో అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2016లో మేఘాలయ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టు  సీజేగా ఉన్నారు. పౌర, రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులను ఆయన ఎక్కువగా విచారించారు. ప్రతీకారం తీర్చుకునేందుకు, అధికారుల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)  దుర్వినియోగం చేయడం తగదని 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా  
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 1960లో ఢిల్లీలో జన్మిం చారు. ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ అందుకున్న ఆయన 1983లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జీగా, అనంతరం 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఖన్నా తదుపరి సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

జస్టిస్‌ ఖన్నా లాయర్‌గా ఉన్న సమయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం–1986కు సంబంధించి వైద్యంలో నిర్లక్ష్యం, కంపెనీ చట్టాలపై పలు కేసులను వాదించారు. అదేవిధంగా, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ ఖన్నా కూడా ఉన్నారు. అప్పటి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ఎండగట్టిన ఈ ధర్మాసనానికి అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వం వహించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement