venkat ramana
-
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ గురువారం వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మొదట వీరి నియామకాలకు సంబంధించి అటు రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులు, ఇటు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లను రిజిస్ట్రార్ బి.రాజశేఖర్ చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యశ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కేసులను విచారించగా.. జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కలిసి జస్టిస్ వెంకటరమణ కేసులను విచారించారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి తాత చీకటి పరశురాంనాయుడు విజయనగరం జిల్లాలో రైతు నాయకుడు, న్యాయవాది కూడా. 1980 దశలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మానవేంద్రనాథ్‌రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2003 జనవరి ఆరో తేదీ వరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, అనంతరం విశాఖపట్నం 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా, 2006 నుంచి 2009 ఏప్రిల్ వరకూ హైదరాబాద్ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, 2009 నుంచి 2012 వరకు విశాఖ జిల్లా జడ్జిగా, 2012 నుంచి 2013 వరకు కృష్ణా జిల్లా జడ్జిగా, 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ 30 వరకు ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ సాఫీగా సాగిపోవడంలో కీలక పాత్ర పోషించారు. జస్టిస్ వెంకటరమణ నేపథ్యం అనంతపురం జిల్లా, గుత్తి స్వస్థలం. ఆయన తండ్రి ఎం.నారాయణరావు. న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. 1982లో వెంకటరమణ న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యాక తండ్రి వద్దే మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత సీనియర్ న్యాయవాది జయరాం వద్ద న్యాయవాదిగా రాటుదేలారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. మొన్నటి వరకు హైదరాబా ద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా వ్యవహరిం చారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు ప్రధాన జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వేధింపుల వల్లే వై.వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆరోపించారు. శనివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం లేని విషయంలో రాజేంద్రప్రసాద్ గత మూడు రోజులుగా వెంకటరమణను వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నస్తున్నారు. -
హమ్మ.. తోట..
ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలు చేసి పోలీసుల అదుపులో ఉన్న తోట వెంకట రమణ శుక్రవారం కోర్టు వద్ద పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. కడప సెంట్రల్ జైలులో ఉంటున్న తోట వెంకట రమణను కోర్టులో హాజరు పరిచేందుకు శుక్రవారం ఎస్కార్టుతో కోడూరుకు తీసుకు వచ్చారు. కోర్టు ఆవరణంలో ఎస్కార్టును తోసేసి పారిపోతుండగా పట్టుకుని స్థానిక పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. - న్యూస్‌లైన్, రైల్వేకోడూరురూరల్ -
సీరియల్ కిల్లర్ అరెస్ట్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తోట వెంకటరమణపై మూడు హత్యలు, మూడు హత్యాయత్నాలతోపాటు బొప్పాయి చెట్ల నరికివేత కేసు, తోట గంగయ్య అనే వ్యక్తిని లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించిన కేసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులాంటివి మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. వెంకటరమణ చేసిన నేరాల గురించి ఈ సందర్భంగా ఎస్సీ వివరించారు. 2009 జూన్ 30వ తేదీన జీవీపురంలో తోట వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి ముందర మంచంపై నిద్రిస్తుండగా వెంకటరమణ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ కేసులో నిందితుడు వెంకటరమణ(19) అదే సంవత్సరం జులై 10న కోర్టులో లొంగిపోయాడు. రిమాండ్‌లో ఉన్న సమయంలో తన తల్లి వెంకటసుబ్బమ్మను కొందరు వ్యక్తులు అవమానపరిచినందున వారిపై పగబట్టాడు. వారిని చంపాలని నాటు తుపాకీ సంపాదించాడు. 2012 జూన్ 21వ తేదీ రాత్రి జీవీ పురానికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న గబ్బి రామకృష్ణను కిటికి గుండా తుపాకీతో కాల్చి పారిపోయాడు. అదే సంవత్సరం జులై 19న తోట సుబ్రమణ్యం అనే వ్యక్తి తన పొలం వెళుతుండగా నాటు తుపాకీతో కాల్చాడు. అయితే తోట సుబ్రమణ్యం గాయాలతో తప్పించుకున్నాడు. ఈ ఏడాది మార్చి 27న తోట సుబ్రమణ్యంను ఎలాగైనా చంపాలని అతని ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అదేరోజు రాత్రి తోట నారాయణపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అంతేగాక పొలాల్లోకి వెళ్లి గబ్బి వెంకటసుబ్బయ్యకు సంబంధించిన బొప్పాయి చెట్లను నరికివేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న తోట వెంకటరమణ గతనెల 24వ తేదీ ఉదయాన్నే తోట సుబ్రమణ్యంను తుపాకీతో కాల్చి చంపాడు. తోట సుబ్రమణ్యం దగ్గర ఉన్న లెసైన్స్ రివాల్వర్‌ను, సెల్ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. ఈనెల 11వ తేదీన రివాల్వర్‌తో కృష్ణంగారిపల్లెకు వచ్చి తోట గంగయ్య అనే వ్యక్తిని రూ. లక్ష ఇవ్వాలని బెదిరించాడు. అనంతరం రాజంపేటలోని ఓ లాడ్జిలో బస చేస్తూ చుట్టూ పక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రాజంపేట నుంచి రాయచోటికి పోవు దారిలో ఉన్న సాయిబాబా గుడి వద్ద శనివారం ఉదయం తోట వెంకటరమణను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి గబ్బి రామకృష్ణయ్య, తోట సుబ్రమణ్యంను కాల్చి చంపిన నాటు తుపాకీని తోట సుబ్రమణ్యంకు సంబంధించిన రివాల్వర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు తోట వెంకటరమణ రాజంపేట పట్టణంలోని తిరుమల లాడ్జిలో వారం రోజులుగా బస చేసి ఉన్న గదిలో సోదా చేసి రివాల్వర్ లెసైన్స్ కాపీతోపాటు బ్యాగ్, బట్టలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు హత్యలు చేసిన తర్వాత విజయవాడకు వెళ్లి అక్కడ క్రేజి హోటల్లో పనిచేస్తూ అప్పుడప్పుడు జీవీపురానికి వచ్చి తాను చంపాలనుకున్న వారి గురించి వివరాలు సేకరిస్తూ అంతమొందించేవాడన్నారు. సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేయడంలో కృషిచేసిన రాజంపేట డీఎస్పీ అన్యోన్య, రైల్వేకోడూరు సీఐ రమాకాంత్, ఎస్బీ సీఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఓఎస్డీ అడ్మిన్ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆచూకీ తెలిపితే రూ. లక్ష
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలకు పాల్పడుతున్న తోట వెంకట రమణ ఆచూకీ తెలిపితే రూ. లక్ష అందజేస్తామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. అలాగే బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన వ్యక్తి ఆచూకీ తెలిపితే రూ. 2 లక్షల రివార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నేరాలకు పాల్పడుతున్న వీరి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అరెస్టు చేసిన తర్వాత రివార్డులను అందజేస్తామన్నారు.తమ నెంబరు 94407 96900 లేదా రాజంపేట డీఎస్పీ, రైల్వేకోడూరు సీఐల ఫోన్ నెంబర్లకు స్వయంగాగానీ, ఫోన్ ద్వారాగానీ సమాచారం ఇవ్వచ్చన్నారు.