కడప అర్బన్, న్యూస్‌లైన్ : వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తోట వెంకటరమణపై మూడు హత్యలు, మూడు హత్యాయత్నాలతోపాటు బొప్పాయి చెట్ల నరికివేత కేసు, తోట గంగయ్య అనే వ్యక్తిని లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించిన కేసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులాంటివి మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. వెంకటరమణ చేసిన నేరాల గురించి ఈ సందర్భంగా ఎస్సీ వివరించారు.
2009 జూన్ 30వ తేదీన జీవీపురంలో తోట వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి ముందర మంచంపై నిద్రిస్తుండగా వెంకటరమణ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ కేసులో నిందితుడు వెంకటరమణ(19) అదే సంవత్సరం జులై 10న కోర్టులో లొంగిపోయాడు. రిమాండ్‌లో ఉన్న సమయంలో తన తల్లి వెంకటసుబ్బమ్మను కొందరు వ్యక్తులు అవమానపరిచినందున వారిపై పగబట్టాడు. వారిని చంపాలని నాటు తుపాకీ సంపాదించాడు.
2012 జూన్ 21వ తేదీ రాత్రి జీవీ పురానికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న గబ్బి రామకృష్ణను కిటికి గుండా తుపాకీతో కాల్చి పారిపోయాడు.
అదే సంవత్సరం జులై 19న తోట సుబ్రమణ్యం అనే వ్యక్తి తన పొలం వెళుతుండగా నాటు తుపాకీతో కాల్చాడు. అయితే తోట సుబ్రమణ్యం గాయాలతో తప్పించుకున్నాడు. ఈ ఏడాది మార్చి 27న తోట సుబ్రమణ్యంను ఎలాగైనా చంపాలని అతని ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అదేరోజు రాత్రి తోట నారాయణపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అంతేగాక పొలాల్లోకి వెళ్లి గబ్బి వెంకటసుబ్బయ్యకు సంబంధించిన బొప్పాయి చెట్లను నరికివేశాడు.
పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న తోట వెంకటరమణ గతనెల 24వ తేదీ ఉదయాన్నే తోట సుబ్రమణ్యంను తుపాకీతో కాల్చి చంపాడు. తోట సుబ్రమణ్యం దగ్గర ఉన్న లెసైన్స్ రివాల్వర్‌ను, సెల్‌ఫోన్లను తీసుకుని పరారయ్యాడు.
ఈనెల 11వ తేదీన రివాల్వర్‌తో కృష్ణంగారిపల్లెకు వచ్చి తోట గంగయ్య అనే వ్యక్తిని రూ. లక్ష ఇవ్వాలని బెదిరించాడు. అనంతరం రాజంపేటలోని ఓ లాడ్జిలో బస చేస్తూ చుట్టూ పక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రాజంపేట నుంచి రాయచోటికి పోవు దారిలో ఉన్న సాయిబాబా గుడి వద్ద శనివారం ఉదయం తోట వెంకటరమణను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి గబ్బి రామకృష్ణయ్య, తోట సుబ్రమణ్యంను కాల్చి చంపిన నాటు తుపాకీని తోట సుబ్రమణ్యంకు సంబంధించిన రివాల్వర్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితుడు తోట వెంకటరమణ రాజంపేట పట్టణంలోని తిరుమల లాడ్జిలో వారం రోజులుగా బస చేసి ఉన్న గదిలో సోదా చేసి రివాల్వర్ లెసైన్స్ కాపీతోపాటు బ్యాగ్, బట్టలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు హత్యలు చేసిన తర్వాత విజయవాడకు వెళ్లి అక్కడ క్రేజి హోటల్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడు జీవీపురానికి వచ్చి తాను చంపాలనుకున్న వారి గురించి వివరాలు సేకరిస్తూ అంతమొందించేవాడన్నారు. సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేయడంలో కృషిచేసిన రాజంపేట డీఎస్పీ అన్యోన్య, రైల్వేకోడూరు సీఐ రమాకాంత్, ఎస్‌బీ సీఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఓఎస్‌డీ అడ్మిన్ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సీరియల్ కిల్లర్ అరెస్ట్
Published Sun, Dec 15 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement