ఆ సేవలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే
రైల్వేలో తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలంపై హైకోర్టు
13 ఏళ్ల నాటి ప్రశ్నకు విస్తృత ధర్మాసనం సమాధానం
పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం కాదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘భారతీయ రైల్వేల్లో రోజువారీ వేతనంపై ఓ క్యాజువల్ లేబర్ పని చేసేవాడు. తర్వాత తాత్కాలిక ఉద్యోగిగా నియమితుడయ్యాడు. అనంతరం రెగ్యులర్ ఉద్యోగి అయ్యాడు. ఆ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలను లెక్కించేటప్పుడు అతను తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలాన్ని, క్యాజువల్ లేబర్‌గా సేవలందించిన కాలంలో 50 శాతం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా?’ అనే 2002 నాటి ప్రశ్నకు హైకోర్టు విస్తృత ధర్మాసనం సమాధానం ఇచ్చింది.
ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తాత్కాలిక, రెగ్యులర్ ఉద్యోగిగా ఎలాంటి అంతరాయం లేకుండా ఆ వ్యక్తి సేవలు అందించి ఉంటే ఆ ఉద్యోగి తాత్కాలిక ఉద్యోగ కాలం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే, న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 18న తీర్పునిచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్ నవీన్‌రావు తీర్పు రాశారు.
రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా చూడాలి..
‘రైల్వేబోర్డు రూల్ 20 ప్రకారం ఓ ఉద్యోగి సర్వీసును అతను మొదట ఏ పోస్టులో చేరారో అప్పటి నుంచి లెక్కించాలి. అది తాత్కాలిక ఉద్యోగమైనా సరే. అయితే ఆ ఉద్యోగాన్ని నిరాటంకంగా చేసి ఉండాలి. ఈ విషయంలో తాత్కాలిక ఉద్యోగిని కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చూడాలి. కాబట్టి పదవీ విరమణ ప్రయోజనాలు లెక్కించేటప్పుడు అతను పనిచేసిన కాలంలో 50 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంత మాత్రం అర్థం లేని పని.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి కావు..
‘ఓ నిబంధన ఎక్కువ మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుంటే, ఆ నిబంధన పట్ల ఉదారతతో వ్యవహరించి ఆ మేర భాష్యం చెప్పాల్సి ఉంటుంది. పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి ఎంత మాత్రం కావు. ఓ ఉద్యోగి ఎంతో కష్టపడి, నిబద్ధతతో అందించిన సేవలకు గాను నగదు రూపంలో ఇచ్చే గుర్తింపు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.