రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్‌వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు.
ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు.
ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్‌వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్‌కు అర్హులు అవుతారని చెప్పారు.
సూపర్‌వైజరీ క్యాడర్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు.
చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్
Comments
Please login to add a commentAdd a comment