మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బ్యూరోక్రాట్లు(పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారులు) రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ రాజీనామా ఆమోదం పొందింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన నిషా బాంగ్రే రాజీనామా ఆమోదం పెండింగ్‌లో ఉంది. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రానని రాజీవ్ చెప్పగా, నిషా మాత్రం రాజకీయ రంగంలోకి దూకేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఐఏఎస్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన కొందరు అధికారులు రెండు నెలల క్రితమే బీజేపీలో చేరగా, మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు క్యూలో ఉన్నారు. కాగా ఒక ఉన్నతాధికారి రాజకీయాల్లో విజయవంతమయ్యారనే దానికి ఉదాహరణ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ఈయన ఐఏఎస్ సర్వీస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. తరువాతి కాలంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు తమ పదవులను వదిలి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అజాతశత్రు: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు.
అజితా వాజ్‌పేయి పాండే: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.
జీఎస్ దామోర్: నీటి వనరులశాఖలో ఇంజనీర్ అయిన ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి, రత్లాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
హీరాలాల్ త్రివేది: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ‘స్పాక్స్’ పార్టీని స్థాపించారు.
రుస్తమ్ సింగ్: ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేశాక బీజేపీలోకి వచ్చారు. మంత్రిగా కూడా అయ్యారు.
ఎస్ ఎస్ ఉప్పల్ : ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు.
వరదమూర్తి మిశ్రా: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి, ప్రత్యేక పార్టీని స్థాపించారు.
వీణా ఘనేకర్: ఐఏఎస్ నుండి పదవీ విరమణ తర్వాత స్పాక్స్‌లో చేరారు.
వీకే బాతం: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేశాక కాంగ్రెస్‌లో చేరారు.
ఉన్నతాధికారులు రాజకీయాల్లో ప్రవేశించడం వెనుక ఒక కారణమందని విశ్లేషకులు అంటున్నారు. వీరు ఎమ్మెల్యేలను, మంత్రులను దగ్గరి నుంచి చూడటం వలన వారి హోదాకు ప్రభావితమవుతుంటారు. దీంతో రాజకీయాల్లో తాము కూడా రాణించగలమన్న భావన వారిలో కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే వారు రాజకీయ నాయకులు, పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇది కూడా చదవండి: నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం!
Comments
Please login to add a commentAdd a comment