హైకోర్టు సగం ఖాళీ... | High Court posts wehalf empty | Sakshi
Sakshi News home page

హైకోర్టు సగం ఖాళీ...

Published Sun, Feb 21 2016 3:21 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

హైకోర్టు సగం ఖాళీ... - Sakshi

హైకోర్టు సగం ఖాళీ...

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సగానికి పడిపోయింది. ఒకవైపు న్యాయమూర్తుల పదవీ విరమణలు కొనసాగుతున్నా..

49 పోస్టులకు 24 పోస్టులు ఖాళీ
♦ ఈ రెండు నెలల్లో మరో మూడు పోస్టులు కూడా
♦ ఇన్ని ఖాళీలు హైకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం
♦ తాజాగా పోస్టుల సంఖ్యను 61కి పెంచిన కేంద్రం
♦ నమ్మకస్తులతో జాబితా సిద్ధం చేసిన కేసీఆర్
♦ మొదటి దశలో 10-13 పోస్టుల భర్తీకి అవకాశం
♦ కాలగర్భంలో కలిసిపోయిన 2014 జాబితా
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సగానికి పడిపోయింది. ఒకవైపు న్యాయమూర్తుల పదవీ విరమణలు కొనసాగుతున్నా.. గత రెండు సంవత్సరాలుగా కొత్త నియామకాలు జరగకపోవడంతో హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు భారీగా పేరుకుపోయాయి. కొలీజియం స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు, దానిపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ నేపథ్యంలో 2013 అక్టోబర్ నుంచి పోస్టుల భర్తీ జరగనేలేదు. హైకోర్టులో మొత్తం 49 పోస్టులుంటే, ప్రస్తుతం 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉండటం హైకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం.  మార్చి 1న ఓ న్యాయమూర్తి, ఏప్రిల్‌లో ఇద్దరు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 22కు పడిపోనున్నది. ఈ నెల 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 450 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 తెలంగాణ నుంచి వినిపిస్తున్న పేర్లు...
 రాష్ట్ర విభజన తరువాత తొలిసారి నియామకాలు చేపడుతుండటంతో తెలంగాణనుంచి ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో చాలామంది ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి తమ బయోడేటాలు సమర్పించినట్లు తెలిసింది. అలాగే కేసీఆర్ సైతం తన సొంత మనుషుల ద్వారా వివరాలు తెప్పించుకుని నమ్మకస్తులతో కూడిన ఓ జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఏసీజేను కలిసిన కేసీఆర్ తన జాబితా గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి జె.రామచంద్రరావు, ఎస్.శరత్‌కుమార్, ఎ.సంజీవ్‌కుమార్, సి.వి.భాస్కర్‌రెడ్డి, హెచ్.వేణుగోపాల్, జువ్వాది శ్రీదేవి, సి.వాణిరెడ్డి, ప్రమదారెడ్డి, పి.వినోద్‌కుమార్, భీంపాక నగేష్, ఎ.నజీబ్‌ఖాన్, పి.కేశవరావు, శ్రీనివాసమూర్తి, ఎం.సుధీర్‌కుమార్, ఉన్నం మురళీధరరావు, పి.వి.రమణ, ముమ్మనేని శ్రీనివాసరావు, ఆనందం తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో జె.రామచంద్రరావు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా, శరత్‌కుమార్, సంజీవ్‌కుమార్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు (స్పెషల్ జీపీ)గా, సి.వి.భాస్కర్‌రెడ్డి, హెచ్.వేణుగోపాల్, నజీబ్‌ఖాన్, నగేష్, శ్రీదేవి, వాణిరెడ్డి ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ)గా, వినోద్‌కుమార్ అదనపు పీపీగా, కేశవరావు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన వారు న్యాయవాదులుగా కొనసాగుతున్నారు.

 ఏపీ నుంచి వినిపిస్తున్న పేర్లు...
 ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.ఎన్.హేమేంద్రనాథ్‌రెడ్డి, కటికనేని రమేష్, కొంగర విజయలక్ష్మి, డి.రమేష్, బి.దేవానంద్, బొక్కా సత్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, ఎన్.శివారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో హేమేంద్రనాథ్, కటికనేని రమేష్, విజయలక్ష్మిల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వీరి కోసం ఏసీజేతో మాట్లాడినట్లు సమాచారం. డి.రమేష్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా, దేవానంద్, సత్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు ప్రభుత్వ న్యాయవాదులుగా, శివారెడ్డి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకాల్లో అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు.

 ఆ ఎనిమిదిమంది జాబితా లేనట్లే...
 రాష్ట్ర విభజనకు ముందు ఎనిమిది మంది న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ అప్పటి హైకోర్టు కొలీజియం పంపిన జాబితా కాలగర్భంలో కలిసిపోయినట్లేనని చెబుతున్నారు. ఆ జాబితాను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, తాజాగా పేర్లను సిఫారసు చేయాలని ఏసీజేకు సూచించినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తులు జస్టిస్ రోహిణి, జస్టిస్ అశుతోష్ మెహంతాలతో కూడిన కొలీజియం ఎనిమిది మంది న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ 2014 మార్చిలో జాబితా పంపింది. ఆ జాబితాలో హైకోర్టు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్, ఎ.గిరిధరరావు, అప్పటి అదనపు పీపీ రత్నప్రభ, హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ బత్తుల రాజ్‌కిరణ్, ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సిల్ జె.వి.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, దీపక్ భట్టాచార్జి, మసూద్ అహ్మద్ ఖాన్‌లు ఉన్నారు. అప్పట్లో ఈ జాబితాకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసే పరిస్థితులు ఉన్నా, ఆ తరువాత కొలీజియం స్థానంలో కేంద్రం జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను తీసుకురావడంతో పరిస్థితులు మారిపోయాయి.
 
 న్యాయమూర్తుల పోస్టులు 61కి పెంపు
 కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 49గా ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను 61కి పెంచింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన న్యాయవాదుల పేర్లను సిఫారసు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు సూచించినట్లు తెలిపింది. దీంతో జస్టిస్ బొసాలే, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్‌లతో కూడిన కొలీజియం సమావేశం కానున్నది. అయితే మొదటి దశలో 10 నుంచి 13 పోస్టులను భర్తీ చేసి మిగిలిన పోస్టులను రెండో దశలో అంటే రెండు మూడు నెలల తరువాత చేపట్టే అవకాశం ఉంది. దీనిపై ఏసీజేకు ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పెంచిన 12 పోస్టులను హైకోర్టు విభజన తరువాతనే భర్తీ చేయాలని ఏసీజే ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. భర్తీ చేయబోయే పోస్టుల్లో 33 శాతం పోస్టులను జిల్లా జడ్జీలతో భర్తీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement