
ఏపీ ఫీజులను ఇచ్చేందుకు అభ్యంతరమెందుకు?
ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన ఫీజులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి ఇవ్వడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఉన్న అభ్యంతరాలేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ విద్యామండలికి సుప్రీం ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన ఫీజులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి ఇవ్వడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఉన్న అభ్యంతరాలేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో లేదని, ఆ సంస్థకు చెందిన ఆస్తులన్నీ తెలంగాణ ఉన్నత విద్యామండలికి చెందుతాయంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది పీపీ రావు తమ వాదనలు వినిపించారు. ‘విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకుగాను నిర్వహించిన అర్హత పరీక్షలకు ఫీజులు వసూలు చేశాం. ఆ మొత్తాలను ప్రత్యేక ఖాతాల్లో జమ చేశాం. అయితే ఇవి కూడా తెలంగాణ ఉన్నత విద్యామండలికే చెందుతాయంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?’ అని వాదించారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘ఏపీలో వసూలు చేసిన ఫీజు మొత్తాలను తిరిగి వారికి ఇవ్వడానికి తెలంగాణ మండలికి అభ్యంతరం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
దీనికి తెలంగాణ తరపు న్యాయవాది హీరేన్ రావల్ సమాధానమిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలపై మాకు స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో ప్రధాన ప్రతివాది అయిన కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రే అఫిడవిట్ దాఖలు చేసింది. దానిని అధ్యయనం చేసేందుకు కొంత సమయం కావాలి..’ అని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ కూడా హాజరయ్యారు.