సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన బాట పట్టాలని హైకోర్టు న్యాయవాదులు నిర్ణయించారు. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని, హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో మార్చి 1, 2 తేదీల్లో హైకోర్టు విధులను బహిష్కరించనున్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాద సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. అందరు న్యాయవాదుల అభిప్రాయ సేకరణ తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఇరు సంఘాల అధ్యక్షులు జె.కనకయ్య, సీహెచ్ ధనంజయ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇద్దరు అధ్యక్షుల నేతృత్వంలో మంగళవారం హైకోర్టులో ఇరు సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో 5 తీర్మానాలు చేశారు. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కేంద్రం, సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని, హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయ మూర్తి నియామకానికి కేంద్రం, సుప్రీం కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2012 లోపు దాఖలైన కేసులను నిర్దిష్ట కాల పరిమితిలోపు పరిష్కరించాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.
హైకోర్టులో తగిన న్యాయమూర్తుల్లేని నేపథ్యంలో ఈ సర్క్యులర్ అమలు చేయడం అటు న్యాయమూర్తులకు, ఇటు కక్షిదారులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హైకోర్టులోని బార్ కౌన్సిల్ భవనం నుంచి మదీన వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత కూడా సుప్రీంకోర్టు, కేంద్రం నుంచి స్పందన రాకపోతే 15 రోజుల తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఆందోళన బాటలో హైకోర్టు న్యాయవాదులు
Published Wed, Feb 28 2018 1:11 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment