
శివాజీ నియామకం చెల్లదు
కారెం శివాజీ, ప్రభుత్వ అప్పీళ్లు కొట్టివేత.. హైకోర్టు ధర్మాసనం తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకం చట్ట విరుద్ధమంటూ, అతని నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కారెం శివాజీలు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా విశిష్ట వ్యక్తినే నియమించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.