ఏపీకి 492.. తెలంగాణకు 335
♦ కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు
♦ న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు
♦ జాబితాను విడుదల చేసిన ఉమ్మడి హైకోర్టు
♦ అభ్యంతరాలకు పది రోజుల గడువు
♦ కేటాయింపులపై టీ న్యాయవాదుల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు పడింది. ఇరురాష్ట్రాలకు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులకు సంబంధించిన జాబితాను ఉమ్మడి హైకోర్టు మంగళవారం విడుదల చేసింది. న్యాయాధికారులిచ్చిన ఆప్షన్లు ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ విడుదల చేశారు. ఉభయ రాష్ట్రాల్లో జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు.. మొత్తం కలిపి 830 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురుతప్ప మిగతా 827 మంది ఆప్షన్లు ఇచ్చారు. దీని ఆధారంగా 827 మందిలో 492 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 335 మందిని తెలంగాణకు కేటాయించారు.
పదవీ విరమణ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని.. పదవీ విరమణ చేసిన, మరణించిన న్యాయాధికారుల్ని కూడా ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు అయిన జిల్లా జడ్జీలు జె.ఉమాదేవి, శ్యాంప్రసాద్, ఎన్.బాలయోగి, రజనీలను ప్రాథమికంగా తెలంగాణకు కేటాయించగా.. వారు తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలసి విజ్ఞప్తి చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరగకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో న్యాయాధికారుల విభజనకోసం హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికనుగుణంగా ఆప్షన్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాల్లోని న్యాయాధికారులను ఆదేశించింది. ఆ మేరకు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వగా.. వాటి ఆధారంగా ప్రాథమిక జాబితాను హైకోర్టు రూపొందించింది. దీనిపై అభ్యంతరాలుంటే న్యాయాధికారులు పదిరోజుల్లోగా సీల్డ్ కవర్‌లో ఆయా జిల్లాల జడ్జీలకు పంపాలని రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. జిల్లా జడ్జీలు వాటిని ఈనెల 18కల్లా హైకోర్టుకు పంపాలన్నారు.
తెలంగాణకు కేటాయింపులు...
తెలంగాణకు 335 మందిని కేటాయించగా.. అందులో 77 మంది జిల్లా జడ్జిల కేడర్, 65 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 193 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. ఈ మూడు కేడర్లలోని 28 మంది విశ్రాంత న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు...
ఆంధ్రప్రదేశ్‌కు 492 మందిని కేటాయించగా.. అందులో 79 మంది జిల్లా జడ్జీల కేడర్, 123 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 290 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. 34 మంది విశ్రాంత న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. ముగ్గురు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సర్వీసు రికార్డుల్లోని వివరాల ఆధారంగా వారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
తెలంగాణ న్యాయవాదుల అభ్యంతరం..
తాజా కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు మండిపడుతున్నారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ జాబితా ఉందని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి చెప్పారు. దీనిపై బుధవారం ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 141 మంది ఏపీకి చెందిన న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ న్యాయాధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు నిమ్మ సత్యనారాయణ పేర్కొన్నారు.