తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు.