
మద్రాసు హైకోర్టుకు జస్టిస్ నూతి రామ్మోహనరావు బదిలీ
ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సురేశ్ కైత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీ జియం సిఫారసు మేరకు ఆయనను బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతకం చేశారు. ఈ నెల 19 లోపు ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులపైనా రాష్ట్రపతి సంతకం చేశారు. ఈ నెల 12న జస్టిస్ కైత్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే ప్రమాణం చేయించనున్నారు.
జస్టిస్ రామ్మోహనరావు...
జస్టిస్ రామ్మోహనరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. విజయవాడలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బి.ఎల్ డిగ్రీ సాధించారు. 1978లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి వివిధ అంశాలపై పట్టు సాధించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2006 సెప్టెంబర్ 11న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008 ఏప్రిల్ 10న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.
జస్టిస్ కైత్...
జస్టిస్ కైత్ 1964 మే 24న హరియాణాలోని కకౌత్ గ్రామంలో జన్మించారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి లా పట్టా సాధించారు. 1989లో న్యాయవాదిగా నమోదయ్యారు. పలు కేంద్ర సంస్థలకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 సెప్టెంబర్ 5న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2013లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.