
ఆ సీఏది వృత్తిపరమైన దుష్ర్పవర్తనే..
- మూడేళ్ల పాటు ముఖేష్ గాంగ్‌ను సస్పెండ్ చేయండి
- ఐసీఏఐకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వృత్తిపరమైన దుష్ర్పవర్తనకు పాల్పడిన చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) ముఖేష్ గాంగ్‌ను ప్రాక్టీస్ నుంచి మూడేళ్ల పాటు సస్పెండ్ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో ముఖేష్ సీఏగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఓ కంపెనీ ప్రమోటర్ల పెట్టుబడుల విషయంలో తప్పుడు సమాచారమిచ్చి ప్రజ లను తప్పుదోవ పట్టించి వృత్తిపరమైన దుష్ర్పవర్తనకు పాల్పడినందుకు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ముఖేష్ గాంగ్ అండ్ కో పేరు మీద ముఖేష్ సీఏగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.
రితేష్ పాలిస్టర్ లిమిటెడ్‌కు చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ప్రధాన ప్రమోటర్ల పెట్టుబడి వాటా రూ.35 లక్షలు కాగా, వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించకుండానే వారి పెట్టుబడి రూ.2.25 కోట్లు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దర్యాప్తు జరిపి, ముఖేష్ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారని తేల్చింది. తద్వారా వృత్తిపరమైన దుష్ర్పవర్తనకు పాల్పడి ఇతర పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని, అందువల్ల ముఖేష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఐసీఏఐకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేష్‌పై చర్యలు తీసుకునేందుకు వీలుగా చార్టెడ్ అకౌంటెంట్స్ చట్టం 1949 సెక్షన్ 21(5) కింద ఈ కేసును హైకోర్టుకు ఐసీఏఐ నివేదించింది. దీంతో దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.