నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీః నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇటువంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, ఇదే సమయంలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో అలసత్వం ప్రదర్శించే విద్యాశాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఈ విషయంలో మరో మాటకు తావులేదంది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియచేయాలని, ఈ సమస్యను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1600కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలన్నింటినీ పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. సోమవారం ఉదయం ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి వివరాలను ప్రస్తావించింది.