ప్రజోపయోగ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఉమ్మడి హైకోర్టు ఇరు రాష్ట్రాలకు శుక్రవారం కీలకమైన ఆదేశాలు జారీచేసింది.
ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
జీవో 18ని యథాతథంగా అమలు చేయాలి
ఉత్తర్వుల అమలుపై నివేదిక ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజోపయోగ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఉమ్మడి హైకోర్టు ఇరు రాష్ట్రాలకు శుక్రవారం కీలకమైన ఆదేశాలు జారీచేసింది. గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, పేవ్‌మెంట్లు, ఇతర ప్రజోపయోగ స్థలాల్లో కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేయవద్దంటూ జారీ చేసిన జీవో 18ని యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ జీవోకు విరుద్ధంగా వెలసిన విగ్రహాలను, కటౌట్లను, ఫెక్లీలను, బోర్డులను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. జీవో 18 ఉల్లంఘన జరగకుండా చూడాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడి న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ ఆదేశాల అమలుపై సంక్రాంతి సెలవుల తరవాత నివేదికను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై విగ్రహాలను, కటౌ ట్లు తదితరాలను అనుమతించజాలమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాక ఆయా నేతల పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బోర్డులను చూస్తే ఆ నేతలకే విసుగు కలిగించేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. ప్రకాశంజిల్లా ముక్తినూతలపాడు నుంచి గుడిమిల్లపాడు వెళ్లే రోడ్డును ఆక్రమించి, ఓ విగ్రహం ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం, దీనిని శుక్రవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా జీవో18ని పరిశీలించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ.. ‘తాము గత విచారణ సమయంలో లేవనెత్తిన అంశంపై అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లోనే జీవో జారీ చేయడం పట్ల మేం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వాధికారులు ఆ జీవోను యథాతథంగా అమలు చేయాలి. జీవోకు విరుద్ధంగా ఏర్పాటైన విగ్రహాలను, కటౌట్లను, ఫ్లెక్సీలను, బోర్డులను గుర్తించి.. వాటిని వెంటనే తొలగించాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. అపాయింటెడ్ డేకి ముందే ఈ జీవో జారీ అయింది కాబట్టి, దానిని అమలులో ఉన్న చట్టంగానే భావించి, దానిని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు అమలు చేయాలి’ అని పేర్కొంది.