సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల్లో సివిల్ దావా దాఖలు చేసే వ్యక్తులు కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆ దావా చట్ట ప్రకారం సరైనది కాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. దావా వేసిన వ్యక్తి కచ్చితంగా కోర్టుకొచ్చి తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఆ ఆస్తికి తనను వారసురాలిగా ప్రకటించాలని కోరుతూ ఎన్.గంగమ్మ అనే మహిళ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దావా దాఖలు చేశారు.
అయితే ఈ కేసులో నిబంధనల ప్రకారం వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఎవరిపైనైతే దావా దాఖలు చేశారో వారికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చింది. దీనిపై ఆమె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సురేశ్ కెయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తిపై హక్కు కోరుతున్న గంగమ్మ, ఆ ఆస్తికి తాను ఏ విధంగా వారసురాలు, ఆ ఆస్తి ఎప్పుడు, ఎవరు ఇచ్చారు? తదితర వివరాలను తెలియచేసేందుకు కోర్టుకు రాలేదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దావా వేసిన వ్యక్తి తప్పనిసరిగా కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే గంగమ్మ ఆ పని చేయకపోవడం సరికాదని స్పష్టం చేసింది. ఇలా హాజరుకాని పక్షంలో ఆ దావాను సక్రమమైనదిగా భావించే ఆస్కారం లేదు కాబట్టి, కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చడంలో తప్పులేదంటూ గంగమ్మ పిటిషన్‌ను కొట్టేసింది.
దావా వేసిన వ్యక్తి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలి
Published Fri, Nov 17 2017 3:57 AM | Last Updated on Fri, Nov 17 2017 3:57 AM
Advertisement
Advertisement