Civil suit
-
దావా వేసిన వ్యక్తి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల్లో సివిల్ దావా దాఖలు చేసే వ్యక్తులు కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆ దావా చట్ట ప్రకారం సరైనది కాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. దావా వేసిన వ్యక్తి కచ్చితంగా కోర్టుకొచ్చి తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఆ ఆస్తికి తనను వారసురాలిగా ప్రకటించాలని కోరుతూ ఎన్.గంగమ్మ అనే మహిళ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దావా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో నిబంధనల ప్రకారం వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఎవరిపైనైతే దావా దాఖలు చేశారో వారికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చింది. దీనిపై ఆమె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సురేశ్ కెయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తిపై హక్కు కోరుతున్న గంగమ్మ, ఆ ఆస్తికి తాను ఏ విధంగా వారసురాలు, ఆ ఆస్తి ఎప్పుడు, ఎవరు ఇచ్చారు? తదితర వివరాలను తెలియచేసేందుకు కోర్టుకు రాలేదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దావా వేసిన వ్యక్తి తప్పనిసరిగా కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే గంగమ్మ ఆ పని చేయకపోవడం సరికాదని స్పష్టం చేసింది. ఇలా హాజరుకాని పక్షంలో ఆ దావాను సక్రమమైనదిగా భావించే ఆస్కారం లేదు కాబట్టి, కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చడంలో తప్పులేదంటూ గంగమ్మ పిటిషన్‌ను కొట్టేసింది. -
సోనియాపై సివిల్ కేసు
తిరువనంతపురం: కేరళలో హీదర్ అనే నిర్మాణ కంపెనీ తమ బకాయిలను చెల్లించనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మరికొంతమందిపై సివిల్ కేసు దాఖలుచేసింది. నెయ్యర్‌లో తాము నిర్మించిన రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ కాంప్లెక్స్‌కు రూ.2.8 కోట్లు బకాయిలు చెల్లించలేదని పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది బాబూరాజ్ స్థానిక కోర్టులో ఇటీవల ఈ సివిల్ దావా దాఖలుచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, విపక్ష నేత రమేశ్ చెన్నితల, ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ హిదుర్ ముహమ్మద్‌లను కూడా ఈ దావాలో చేర్చినట్లు బాబూరాజ్ చెప్పారు. -
రేపు ముంబై కోర్టులో ఆమీర్ ఖాన్ పీకే వివాదం!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీ.కే' చిత్ర పోస్టర్ పై వివాదం కొనసాగుతునే ఉంది. పీకే చిత్ర పోస్టర్, అసభ్యత, అశ్లీల అంశాలపై ముంబై కోర్టులో ఇటీవల నమోదైన కేసు మంగళవారం విచారణకు రానుంది. పీ.కే చిత్రంలో అశ్లీల పోస్టర్లు తొలగించాలని, దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఈ కేసులో నటుడు అమీర్ ఖాన్, నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, సెన్సార్ బోర్డులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అశ్లీలంగా, నగ్నంగా ఉన్న అమీర్ ఖాన్ పోస్టర్ తో దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని పిటిషన్ దాఖలు చేశారు. సత్యమేవ జయతే లాంటి టెలివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించి క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న అమీర్ నటుడు నగ్నంగా ఉండే పోస్టర్ ను పబ్లిసిటీ వినియోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.