ఆ బదలాయింపునకు పన్ను చెల్లించనవసరం లేదు
‘ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్’ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: కొనసాగుతున్న వ్యాపారం మొత్తాన్ని ఓ కంపెనీ గంపగుత్తగా మరో కంపెనీకి వాటాలు పొందే ప్రాతిపదికన బదలాయించినప్పుడు దానికి పన్ను విధించడం సరికాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ తన వ్యాపారం మొత్తాన్ని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించినందుకు రాష్ట్ర వ్యాట్ చట్టం కింద పన్ను చెల్లింపు నిమిత్తం అసిస్టెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వ్యాపారం మొత్తాన్ని విక్రయించనందుకు పన్ను చెల్లించాలని చట్టంలో ఎక్కడా లేద ని తెలిపింది. పన్ను చెల్లింపు విషయంలో అసిస్టెంట్ కమిషనర్ పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
గంపగుత్తగా జరిగిన బదలాయింపులో మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయని అసిస్టెంట్ కమిషనర్ తప్పుగా ఆలోచించారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ తన వ్యాపారం మొత్తాన్ని తాము వాటాదారులుగా ఉన్న ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ లిమిటెడ్‌కు గంపగుత్తగా బదలాయించింది. ఇందుకు గాను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఈక్విటీ, ప్రిఫరెన్షియల్ షేర్లు పొందుతుంది. దీనిలో ఇతర ఆస్తుల అమ్మకం ఉందని భావించిన పన్ను అధికారులు పన్ను చెల్లించాలని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్‌ను ఆదేశించారు. వీటిని సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.