Paradise Food Court
-
ఏడాదిపాటు ఫ్రీగా బిర్యానీ!
సాక్షి, హైదరాబాద్ : ప్యారడైజ్ హోటల్స్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచకప్ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు #WorldCupWithParadise అనే పోటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోటీలో పాల్గొని గెలిచిన వారికి ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా బిర్యానీని గిఫ్ట్ రూపంలో పొందవచ్చని వెల్లడించింది. ఈ పోటీ జూన్ 7 నుంచి జూలై 18వ తేదీ 2019 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, విజేతలకు ప్రతివారం బహుమతులు అందిస్తామని ప్యారడైజ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. బిర్యానీ ప్రియులు ఈ నిర్ణీత సమయంలో ప్యారడైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్లెట్లకు కుటుంబం, స్నేహితులతో విచ్చేసి ఈ పోటీ గురించి వివరంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రికెట్ సీజన్ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. ఇక ఐపీఎల్ సందర్భంగా ప్యారడైజ్ రెగ్యూలర్ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే. -
ప్యారడైజ్ బంఫర్ ఆఫర్..
సాక్షి, హైదరాబాద్ : ప్యారడైజ్ హోటల్ తమ కస్టమర్లకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. బిర్యానీ ప్రియులకు ఐపీఎల్ టిక్కెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్యారడైజ్ హోటల్, కోకకోలా బెవరేజెస్ సంయుక్తంగా ప్యారడైజ్ సర్కిల్లో నమోదుచేసుకున్న రెగ్యులర్ కస్టమర్లకు బిర్యానీతో పాటు ఐపీఎల్ 2019 టిక్కెట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ‘ప్యారడైజ్ సర్కిల్’ తమ రెగ్యులర్ కస్టమర్లను ఉత్సాహపరిచే విధంగా సోమవారం ఉప్పల్ వేదికగా రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ వర్సెస్ కింగ్స్ పంజాబ్ మ్యాచ్ టిక్కెట్లను బహుకరించనుంది. ప్యారడైజ్ సీఈఓ గౌతమ్ గుప్త మాట్లాడుతూ..‘‘ మా కస్టమర్లకు చక్కటి అనుభూతి కలిగించటానికే మేము ప్రయత్నిస్తుంటాం. కోకకోలాతో కలిసి ఇలా మా రెగ్యులర్ కస్టమర్లను సత్కరించటం సంతోషంగా ఉంది. గత 65 సంవత్సరాలుగా హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలలో ప్యారడైజ్ భాగంగా ఉంది. ప్రతి ఒక సంతోషకర సందర్భాన్ని మాతో పంచుకున్న మా నమ్మకమైన కస్టమర్లకు ఏదైనా కానుక ఇవ్వాలనే ప్రయత్నమే టిక్కెట్ల బహుమతులు. ఇది కేవలం బిర్యానీ ప్రియులకు మాత్రమే కాకుండా హలీమ్ ప్రియులకు కూడా సదవకాశం. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది కస్టమర్లు ఈ కార్యక్రమంలో నమోదై ఉన్నార’’ని తెలిపారు. -
ఆ బదలాయింపునకు పన్ను చెల్లించనవసరం లేదు
‘ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్’ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: కొనసాగుతున్న వ్యాపారం మొత్తాన్ని ఓ కంపెనీ గంపగుత్తగా మరో కంపెనీకి వాటాలు పొందే ప్రాతిపదికన బదలాయించినప్పుడు దానికి పన్ను విధించడం సరికాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ తన వ్యాపారం మొత్తాన్ని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించినందుకు రాష్ట్ర వ్యాట్ చట్టం కింద పన్ను చెల్లింపు నిమిత్తం అసిస్టెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వ్యాపారం మొత్తాన్ని విక్రయించనందుకు పన్ను చెల్లించాలని చట్టంలో ఎక్కడా లేద ని తెలిపింది. పన్ను చెల్లింపు విషయంలో అసిస్టెంట్ కమిషనర్ పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. గంపగుత్తగా జరిగిన బదలాయింపులో మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయని అసిస్టెంట్ కమిషనర్ తప్పుగా ఆలోచించారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ తన వ్యాపారం మొత్తాన్ని తాము వాటాదారులుగా ఉన్న ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ లిమిటెడ్‌కు గంపగుత్తగా బదలాయించింది. ఇందుకు గాను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఈక్విటీ, ప్రిఫరెన్షియల్ షేర్లు పొందుతుంది. దీనిలో ఇతర ఆస్తుల అమ్మకం ఉందని భావించిన పన్ను అధికారులు పన్ను చెల్లించాలని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్‌ను ఆదేశించారు. వీటిని సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.