ప్రశ్నించడం ప్రతిపక్షనేత బాధ్యత
⇒ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యాయం
⇒ హైకోర్టుకు జగన్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదన
⇒ జగన్, జోగి రమేశ్‌ల పిటిషన్లపై ముగిసిన వాదనలు
⇒ నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా, నందిగామ పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, పార్టీ నేత జోగి రమేశ్, మరికొం దరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఉమ్మడి హైకోర్టులో సోమవారం వాదనలు ముగి శాయి. వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ పోలీసు లు తమపై గత నెల 28న నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ జగన్ ఒక పిటిషన్, పార్టీ నేతలు జోగి రమేశ్ మరి కొందరు మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ శంకర నారాయణ విచారణ జరిపారు. ఈ సందర్భంగా జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత నెల 28న అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 11 మంది మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతగా జగన్ నందిగామ ఆసుపత్రికి వెళ్లారని, జిల్లా కలెక్టర్ స్వయంగా ఆయనను పోస్టుమార్టం రూమ్‌కు తీసుకెళ్లారని వివరించారు. నిబం ధనల ప్రకారం మృతులకు పోస్టు మార్టం చేశారా? లేదా? అని జగన్ ప్రశ్నించారని, ఈ సందర్భంగా కొన్ని సందే హాలను లేవనెత్తి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయని విషయం తెలియడంతో దానిపై ఆయన డాక్టర్లను ప్రశ్నించారన్నారు. పోస్టుమార్టం చేయకుంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయని, ఇది సరికాదని మాత్రమే జగన్ చెప్పారని వివరించారు. తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం ప్రజా ప్రతినిధిగా, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు చాలా అన్యాయంగా వ్యవహ రించారని, రెండో డ్రైవర్‌ను కనీసం ప్రశ్నించ కుండానే ఘటనా స్థలం నుంచి పంపేశారని తెలిపారు. ప్రశ్నించినందుకు, బాధ్యతలను గుర్తు చేసినందుకే కేసు పెట్టడం విస్మయం కలిగిస్తోందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన బస్సు కావడంతోనే ఓ డాక్టర్ సైతం ప్రతిపక్ష నాయకుడిపై కేసు పెట్టగలిగారని తెలిపారు. రాజకీయ దురు ద్దేశాలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని వివరించారు. డాక్టర్ నుంచి కాగితాలను లాక్కున్నారన్నది కూడా అవాస్తవమన్నారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందో వీడియో ఆధారం ఉందంటూ, దాని తాలుకూ సంభా షణల కాపీని మోహన్‌రెడ్డి న్యాయమూర్తికి సమర్పించారు. అంతేకాక ఈ కేసుకు, ఆరోపణలకు పొంతన లేదన్నారు. కేసులో పేర్కొన్న సెక్షన్లేవీ కూడా వర్తించవని తెలిపారు. తరువాత జోగి రమేశ్ తదితరుల తరఫున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రెండు ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ... ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు. కాబట్టి ఈ దశలో సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టు తన విచక్షణాధికారాలను ఉపయో గించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా దర్యాప్తు పూర్తి కావడం గానీ, అభియో గాల నమోదు గానీ జరగలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.