CV Mohan Reddy
-
ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే
-
ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై జరుగుతున్న విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను తప్పుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని దానిపై ముందు విచారణ జరపాల్సిన అవసరముందని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి జస్టిస్ రాకేశ్‌కుమార్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తీవ్రమైనదని, దానిపై విచారణ జరపకుండా, అలా పక్కన పడేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. విచారణ నుంచి తప్పుకోవాలని తాము చాలా గౌరవప్రదంగా కోరుతున్నామని, ఆ దిశగానే వాదనలు వినిపిస్తామన్నారు. మొదట ప్రభుత్వ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన, జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆ తరువాత అందుకు సమ్మతించి శుక్రవారం విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు.. పోలీసులపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చాయి. చదవండి: (చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి) ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసిందని.. అది విచారణకు రాలేదని, అందువల్ల తమ అనుబంధ పిటిషన్‌తో పాటు అన్నీ వ్యాజ్యాలను శుక్రవారం విచారించాలని అభ్యర్థించారు. కానీ, దీనిని తోసిపుచ్చిన జస్టిస్ రాకేశ్‌కుమార్, రాజ్యాంగం వైఫల్యం అంశంపై విచారణ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వాదనలు వినిపిస్తే వినిపించాలని, లేకపోతే విచారణను ముగిస్తానన్నారు. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ, ముందుస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి, ఈ కేసును విచారించడం సమర్థనీయం కాదని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ రాకేశ్ జోక్యం చేసుకుంటూ, నేను అలాంటి పిటిషన్‌ను విచారించబోనని తెలిపారు. ఈ పిటిషన్ వేయకూడదనే అనుకున్నాం ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేయకూడదనే అనుకున్నదని, ఆయితే మీరు (జస్టిస్ రాకేశ్) పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు కల్పించారని మోహన్‌రెడ్డి చెప్పారు. సుమన్ స్పందిస్తూ.. ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తమకు అందజేయాలని ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు తమకు అందలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉచితంగా కాపీ ఇవ్వరని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా, తాము డబ్బు కట్టే దరఖాస్తు చేసుకున్నామని సుమన్ సమాధానమిచ్చారు. కాపీ రాకుంటే తామెలా సుప్రీంకోర్టుకు వెళ్లగలమన్నారు. మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. కేసు ఫైళ్లను ఛాంబర్లో పెట్టుకుని, వాటిని రిజిస్ట్రీకి పంపకుంటే, తాము ఎప్పటికీ ఉత్తర్వుల కాపీని అందుకోలేమని చెప్పారు. న్యాయమూర్తి ఇందుకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను శుక్రవారానికి వాయిదా వేశారు. నో చెప్పడానికి వీల్లేదు.. ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ రికార్డులను తెప్పించాలని.. మోహన్‌రెడ్డి కోరారు. కోర్టు ప్రతీ దానికీ, ప్రతీ దాన్ని నో చెప్పడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ అనుబంధ పిటిషన్ తమ ముందులేదని రాకేశ్ చెప్పగా, దానిని తెప్పించుకోవాలనడంతో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రభుత్వ పిటిషన్‌ను పరిశీలిస్తామని జస్టిస్ రాకేశ్ తెలిపారు. -
రాజకీయ లబ్ధికే బాబు నిందారోపణలు
సాక్షి, అమరావతి : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల వేళ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. ఈ కేసులో వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులపై నిరాధార, నిందారోపణలు చేస్తున్నారన్నారు. తమ ప్రకటనలు, మాటల ద్వారా ఈ కేసులో ఎలా దర్యాప్తు చేయాలి.. దర్యాప్తునకు ఏ ముగింపునివ్వాలనే దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు దిశా నిర్దేశం చేస్తున్నారని ఆయన వివరించారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్య హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లతోపాటు ఈ కేసులో తుది నివేదిక దాఖలు చేయకుండా ‘సిట్’ను ఆదేశించాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జగన్, సౌభాగ్యల తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఎం దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు ఎన్నికలకు ముందే దర్యాప్తును పూర్తిచేసి, దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో వివేకానందరెడ్డి హత్య కేసులో ‘సిట్’ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకంలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలేని స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. అది సీబీఐ కావొచ్చు, మరో దర్యాప్తు సంస్థైనా తమకు అభ్యంతరంలేదన్నారు. తమకు కావాల్సింది హత్య ఎవరు.. ఎందుకు చేశారన్న నిజమే తప్ప, రాజకీయాలు కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి పదేపదే ప్రకటనలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, ఈ ప్రకటనలకు ప్రభావితమై పోలీసులు చేసే దర్యాప్తును నిష్పాక్షిక దర్యాప్తుగా ఎలా చెప్పగలమన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా లేనప్పుడు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని, న్యాయస్థానం కూడా జోక్యం చేసుకుని దర్యాప్తు విషయంలో తగిన ఆదేశాలు జారీచేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రస్తుతం తాము ‘సిట్’ దర్యాప్తును ఆపేయమని కోరడంలేదని, దర్యాప్తును కొనసాగించుకోవచ్చునని, అయితే.. ఈ దర్యాప్తు పక్షపాతమా? నిష్పక్షపాతమా? అన్న అంశాన్ని ఈ కోర్టు తేల్చేంత వరకు, వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక (చార్జిషీట్) దాఖలు చేయకుండా ‘సిట్’ను ఆదేశించాలని కోరారు. అంతేకాక, ఈ కేసు ద్వారా అధికార టీడీపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నందున, ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా బహిర్గతం చేయకుండా ‘సిట్’ను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మోహన్‌రెడ్డి మంగళవారం తన వాదనలను ముగించిన నేపథ్యంలో, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆ రోజు మొదటి కేసు కింద ఈ వ్యాజ్యంలో వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్శ్రీ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి లేదు కదా.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకుండా అనుమతిని ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కదా? మరిప్పుడు మేం సీబీఐకి ఎలా ఆదేశాలు ఇవ్వగలం? పరిస్థితి ఏంటి? అని సందేహం వెలిబుచ్చింది. ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏదైనా కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని మోహన్‌రెడ్డి వివరించారు. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని గౌహాతీ హైకోర్టు తీర్పునిచ్చింది కదా.. దాని సంగతేమిటని ధర్మాసనం ఆరా తీయగా, ఆ తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపేసిందని, కేసు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. అనంతరం ధర్మాసనం.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ వాదనల నిమిత్తం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సమయంలో మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ‘సిట్’ అధికారులు మీడియాకు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ‘చూద్దాం’.. అంటూ న్యాయమూర్తులు నవ్వుతూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
ప్రశ్నించడం ప్రతిపక్షనేత బాధ్యత
⇒ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యాయం ⇒ హైకోర్టుకు జగన్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదన ⇒ జగన్, జోగి రమేశ్‌ల పిటిషన్లపై ముగిసిన వాదనలు ⇒ నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా, నందిగామ పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, పార్టీ నేత జోగి రమేశ్, మరికొం దరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఉమ్మడి హైకోర్టులో సోమవారం వాదనలు ముగి శాయి. వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ పోలీసు లు తమపై గత నెల 28న నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ జగన్ ఒక పిటిషన్, పార్టీ నేతలు జోగి రమేశ్ మరి కొందరు మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ శంకర నారాయణ విచారణ జరిపారు. ఈ సందర్భంగా జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత నెల 28న అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 11 మంది మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతగా జగన్ నందిగామ ఆసుపత్రికి వెళ్లారని, జిల్లా కలెక్టర్ స్వయంగా ఆయనను పోస్టుమార్టం రూమ్‌కు తీసుకెళ్లారని వివరించారు. నిబం ధనల ప్రకారం మృతులకు పోస్టు మార్టం చేశారా? లేదా? అని జగన్ ప్రశ్నించారని, ఈ సందర్భంగా కొన్ని సందే హాలను లేవనెత్తి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయని విషయం తెలియడంతో దానిపై ఆయన డాక్టర్లను ప్రశ్నించారన్నారు. పోస్టుమార్టం చేయకుంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయని, ఇది సరికాదని మాత్రమే జగన్ చెప్పారని వివరించారు. తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం ప్రజా ప్రతినిధిగా, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు చాలా అన్యాయంగా వ్యవహ రించారని, రెండో డ్రైవర్‌ను కనీసం ప్రశ్నించ కుండానే ఘటనా స్థలం నుంచి పంపేశారని తెలిపారు. ప్రశ్నించినందుకు, బాధ్యతలను గుర్తు చేసినందుకే కేసు పెట్టడం విస్మయం కలిగిస్తోందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన బస్సు కావడంతోనే ఓ డాక్టర్ సైతం ప్రతిపక్ష నాయకుడిపై కేసు పెట్టగలిగారని తెలిపారు. రాజకీయ దురు ద్దేశాలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని వివరించారు. డాక్టర్ నుంచి కాగితాలను లాక్కున్నారన్నది కూడా అవాస్తవమన్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందో వీడియో ఆధారం ఉందంటూ, దాని తాలుకూ సంభా షణల కాపీని మోహన్‌రెడ్డి న్యాయమూర్తికి సమర్పించారు. అంతేకాక ఈ కేసుకు, ఆరోపణలకు పొంతన లేదన్నారు. కేసులో పేర్కొన్న సెక్షన్లేవీ కూడా వర్తించవని తెలిపారు. తరువాత జోగి రమేశ్ తదితరుల తరఫున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రెండు ఎఫ్ఐఆర్లలో పేర్కొన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ... ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు. కాబట్టి ఈ దశలో సీఆర్పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టు తన విచక్షణాధికారాలను ఉపయో గించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా దర్యాప్తు పూర్తి కావడం గానీ, అభియో గాల నమోదు గానీ జరగలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బిల్లును పార్లమెంటుకు పంపితే సుప్రీం కోర్టులో పిటిషన్:సివి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌కు పంపితే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని సీమాంధ్ర అడ్వకేట్ జేఏసీ చైర్మన్ సివి మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 29న ఇందిరాపార్క్ వద్ద సీమాంధ్ర అడ్వకేట్ జేఏసీ ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని, దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసు ఇప్పించారు. ఒకవేళ బిల్లు తిప్పిపంపినా, రాష్ట్రపతి దానిని పార్లమెంటుకు పంపించే అవకాశం ఉంది. అలా పంపితే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సివి మోహన రెడ్డి చెబుతున్నారు. -
'రాజీనామాల పేరుతో సీమాంధ్ర నేతల నాటకాలు'
న్యూఢిల్లీ: రాజీనామాల పేరుతో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు నాటకాలు ఆడుతున్నారని సీమాంధ్ర గెజిటెడ్ జేఏసీ కన్వీనర్ సి.వి. మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు సర్కారు దిగి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు. రేపు జంతర్‌మంతర్‌లో న్యాయవాదులు ధర్నా చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు మొయిలీ, ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీతారాం ఏచూరిని, జవదేకర్‌ను కలిసి.. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. మరోవైపు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు ఎపీఎన్జీవోలు ప్రకటించారు. -
28న హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదుల సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించవద్దని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్‌రెడ్డి శనివారం యుపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రభుత్వం ముందుకు వెళ్లితే సమైక్య ఉద్యమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు. శనివారం సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అనంతపురంలో సమావేశమైంది. ఆ సమావేశానంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలో రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విభజనపై న్యాయపరమైన అంశాలతోనే ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్నికి వ్యతిరేకిస్తూ ఈ నెల 29 వరకు జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 28న హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరం అందరి సొత్తు అని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ మిత్రులపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా కేసులు నమోదు అయిన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తాము ఎంత వరకైన పోరాడతామని సి.వి.మోహన్‌రెడ్డి వెల్లడించారు.