ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించవద్దని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్రెడ్డి శనివారం యుపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రభుత్వం ముందుకు వెళ్లితే సమైక్య ఉద్యమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు. శనివారం సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అనంతపురంలో సమావేశమైంది.
ఆ సమావేశానంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలో రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విభజనపై న్యాయపరమైన అంశాలతోనే ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్నికి వ్యతిరేకిస్తూ ఈ నెల 29 వరకు జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 28న హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరం అందరి సొత్తు అని మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ మిత్రులపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా కేసులు నమోదు అయిన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తాము ఎంత వరకైన పోరాడతామని సి.వి.మోహన్రెడ్డి వెల్లడించారు.