రాజకీయ లబ్ధికే బాబు నిందారోపణలు | Chandrababu Baseless comments on Viveka murder case | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధికే బాబు నిందారోపణలు

Published Wed, Mar 27 2019 5:40 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

Chandrababu Baseless comments on Viveka murder case - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు నివేదించారు.  ఎన్నికల వేళ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. ఈ కేసులో వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులపై నిరాధార, నిందారోపణలు చేస్తున్నారన్నారు. తమ ప్రకటనలు, మాటల ద్వారా ఈ కేసులో ఎలా దర్యాప్తు చేయాలి.. దర్యాప్తునకు ఏ ముగింపునివ్వాలనే దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు దిశా నిర్దేశం చేస్తున్నారని ఆయన వివరించారు. వైఎస్‌ వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్య హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లతోపాటు ఈ కేసులో తుది నివేదిక దాఖలు చేయకుండా ‘సిట్‌’ను ఆదేశించాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జగన్, సౌభాగ్యల తరఫున సీనియర్‌ న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

సీఎం దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు
ఎన్నికలకు ముందే దర్యాప్తును పూర్తిచేసి, దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో వివేకానందరెడ్డి హత్య కేసులో ‘సిట్‌’ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకంలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలేని స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. అది సీబీఐ కావొచ్చు, మరో దర్యాప్తు సంస్థైనా తమకు అభ్యంతరంలేదన్నారు. తమకు కావాల్సింది హత్య ఎవరు.. ఎందుకు చేశారన్న నిజమే తప్ప, రాజకీయాలు కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి పదేపదే ప్రకటనలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, ఈ ప్రకటనలకు ప్రభావితమై పోలీసులు చేసే దర్యాప్తును నిష్పాక్షిక దర్యాప్తుగా ఎలా చెప్పగలమన్నారు.

పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా లేనప్పుడు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని, న్యాయస్థానం కూడా జోక్యం చేసుకుని దర్యాప్తు విషయంలో తగిన ఆదేశాలు జారీచేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రస్తుతం తాము ‘సిట్‌’ దర్యాప్తును ఆపేయమని కోరడంలేదని, దర్యాప్తును కొనసాగించుకోవచ్చునని, అయితే.. ఈ దర్యాప్తు పక్షపాతమా? నిష్పక్షపాతమా? అన్న అంశాన్ని ఈ కోర్టు తేల్చేంత వరకు, వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక (చార్జిషీట్‌) దాఖలు చేయకుండా ‘సిట్‌’ను ఆదేశించాలని కోరారు. అంతేకాక, ఈ కేసు ద్వారా అధికార టీడీపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నందున, ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా బహిర్గతం చేయకుండా ‘సిట్‌’ను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మోహన్‌రెడ్డి మంగళవారం తన వాదనలను ముగించిన నేపథ్యంలో, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌  వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆ రోజు మొదటి కేసు కింద ఈ వ్యాజ్యంలో వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్‌శ్రీ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 

రాష్ట్రంలో సీబీఐకి అనుమతి లేదు కదా..
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకుండా అనుమతిని ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కదా? మరిప్పుడు మేం సీబీఐకి ఎలా ఆదేశాలు ఇవ్వగలం? పరిస్థితి ఏంటి? అని సందేహం వెలిబుచ్చింది. ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏదైనా కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని మోహన్‌రెడ్డి వివరించారు. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని గౌహాతీ హైకోర్టు తీర్పునిచ్చింది కదా.. దాని సంగతేమిటని ధర్మాసనం ఆరా తీయగా, ఆ తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపేసిందని, కేసు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. అనంతరం ధర్మాసనం.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీనివాస్‌ వాదనల నిమిత్తం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సమయంలో మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ‘సిట్‌’ అధికారులు మీడియాకు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ‘చూద్దాం’.. అంటూ న్యాయమూర్తులు నవ్వుతూ బెంచ్‌ దిగి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement