అలహాబాద్ సీజేగా జస్టిస్ బొసాలే
ఉమ్మడి హైకోర్టు ఏసీజే పదోన్నతిపై బదిలీ
* రేపు కొత్త బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ఆయన అలహాబాద్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు. బదిలీ సందర్భంగా ఆయనకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, రిజి స్ట్రార్లు, సిబ్బంది, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మొదటి కోర్టు హాలులో జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ బొసాలే మాట్లాడారు.
న్యాయాధికారులు రోడ్లెక్కడం బాధాకరం
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాపై నిరసన తెలియచేస్తూ తెలంగాణ న్యాయాధికారులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించడం బాధాకరమని జస్టిస్ బొసాలే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయాధికారులు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణకే అత్యధిక ప్రాధాన్యతని, ఇందుకు విరుద్ధంగా న్యాయాధికారులు వ్యవహరించినందునే వారి పై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు. వ్యవస్థలు మనపై ఆధారపడి మనుగడ సాగించడం లేదని, వ్యవస్థలపై మనమే ఆధారపడ్డామన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. వ్యవస్థపై నమ్మకం ఉంచి ఓపికతో ఉన్నప్పుడు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ పలు సందర్భాల్లో కీలక సలహాలు, సూచనలు చేసి, విధి నిర్వహణలో సాయపడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు వార్షిక నివేదికను విడుదల చేశారు. అంతకుముందు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ, హైకోర్టు సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు జస్టిస్ బోసాలేనే కారణమని కొనియాడారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌ల ద్వారా వేల కేసులను పరిష్కరించిన ఘనత జస్టిస్ బొసాలేకే దక్కుతుందన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జస్టిస్ బొసాలే చేసిన కృషి మరువలేనిదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు.
ఘనంగా సన్మానం: అనంతరం ఉమ్మడి రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలో జస్టిస్ బొసాలేకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, అకాడెమీ డెరైక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.