justice bosale
-
ఈ భారం న్యాయమా?
- గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో హైకోర్టు జడ్జీలు - రోజుకు సగటున 60 కేసుల విచారణ - ఒక వైపు పెద్ద సంఖ్యలో దాఖలవుతున్న కేసులు - మరోవైపు భారీగా పేరుకుపోతున్న కేసులు హైకోర్టు న్యాయమూర్తులు పనిభారంతో అల్లాడిపోతున్నారు. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేనంత పని భారాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఇబ్బడిముబ్బడిగా దాఖలవుతున్న కేసులు.. మరోవైపు అదే స్థాయిలో పేరుకుపోతున్న కేసులు జడ్జీలను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. న్యాయమూర్తులే కాదు.. సిబ్బందిది కూడా ఇదే పరిస్థితి. కేసులు దాఖలు చేస్తున్నా విచారణ జాబితాలో వాటికి స్థానం లభించడం లేదని, దాంతో తమ కేసులు విచారణకు రావడం లేదంటూ కోర్టు సిబ్బందిపై అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చిన్నపాటి గొడవలు హైకోర్టులో ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. అనేక సందర్భాల్లో సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చేంత స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. గతంలో హైకోర్టులో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. దీనంతటికీ ప్రధాన కారణం తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడమే! - సాక్షి, హైదరాబాద్ 38 పోస్టులు ఖాళీ..చరిత్రలో ఇదే తొలిసారి హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కేవలం 23. ఏకంగా 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సగానికిపైగా ఖాళీలు ఉండటం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గత రెండున్నరేళ్లలో అంటే 23 అక్టోబర్ 2013 నుంచి 20 మే 2016 వరకు కేవలం ఒక్క జడ్జి పోస్టు మాత్రమే భర్తీ అయింది. జస్టిస్ బొసాలే తాతాల్కిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అప్పటి కొలీజియం పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. అయితే ఆ జాబితా విషయంలో ఇప్పటివరకు తగిన పురోగతి మాత్రం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ పూర్తయినా నియామకాల్లో ఆల స్యం జరుగుతుండంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం ఆలస్యం జరుగుతోందని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నియామకం ఆలస్యం కావడానికి సైతం రాజకీయ జోక్యమే కారణమని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. 10 లక్షల మందికి 12 మందే.. తాజా గణాంకాల ప్రకారం దేశంలో జడ్జీలు-జనాభా దామాషా విషయంలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. దేశంలో ప్రతీ పది లక్షల మందికి జడ్జీల సగటు 18 కాగా, తెలుగు రాష్ట్రాల్లో 12 మాత్రమే. అంటే ప్రతీ పది లక్షల మందికి ఉభయ రాష్ట్రాల్లో 12 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోనే మనం 30వ స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం హైకోర్టులో 2.75 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టులో ప్రతిరోజూ దాఖలయ్యే తాజా కేసులు (అడ్మిషన్) 400 నుంచి 500 వరకు ఉంటాయి. ఈ రోజు కేసులు దాఖలు చేస్తే అవి మరుసటి రోజు కేసుల విచారణ జాబితా (కాజ్లిస్ట్)లో ఉంటాయి. వీటికి లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసే కేసులు అదనం. ఈ కేసులన్నింటినీ ఆయా సబ్జెక్టుల వారీగా పలువురు న్యాయమూర్తులకు కేటాయిస్తారు. ఇందులో రిట్ పిటిషన్లు కీలకమైనవి. అడ్మిషన్ కేసులను విచారించే న్యాయమూర్తులు ముందుకు తాజా కేసులతో పాటు గత విచారణ సమయంలో వాయిదా పడ్డ కేసులు కూడా వస్తుంటాయి. ఇలా అన్ని కేసులూ కలిపి ఆ న్యాయమూర్తుల ఒక్కొక్కరి జాబితాలో కనీసం 200 కేసులు ఉంటాయి. అయితే వీటిలో విచారణకు నోచుకునేది 60 నుంచి 80 కేసులు మాత్రమే. ఇది ఒక్కో జడ్జీని బట్టి ఉంటుంది. కొందరు 90 కేసులను కూడా విచారిస్తే.. మరికొందరు 60 కన్నా తక్కువ కేసులను విచారించే పరిస్థితులున్నాయి. సగటున న్యాయమూర్తులు రోజుకు 70 కేసులకు తక్కువ కాకుండా విచారిస్తున్నారు. ఇళ్ల వద్దా అధ్యయనం ప్రతిరోజూ హైకోర్టులో దాఖలయ్యే కేసుల్లో కొన్నింటిని సబ్జెక్టులను బట్టి ఆయా న్యాయమూర్తులు తమ తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొందరు న్యాయమూర్తులు రాత్రి 11.30 గంటల వరకు ఆ కేసులను అధ్యయనం చేస్తున్నారు. మళ్లీ ఉదయం 6 గంటలకు లేచి ఓ గంటన్నర పాటు కేసులను అధ్యయనం చేసి కోర్టుకు వస్తున్నారు. ఈ స్థాయిలో న్యాయమూర్తులు కసరత్తు చేస్తుంటేనే రోజుకు 60 కేసులను విచారించడానికి సాధ్యమవుతోంది. ఇది కాక తీర్పులను సిద్ధం చేసినప్పుడు దానిని వెలువరించడానికి ముందు తప్పులను సవరించడానికి కూడా న్యాయమూర్తులకు అత్యధిక సమయం పడుతూ ఉంటుంది. సాయంత్రం 4.30 గంటలకు కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాల నిమిత్తం నిత్యం న్యాయమూర్తుల నేతృత్వంలో ఏదో ఒక కమిటీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఇదే సమయంలో ఆయా జిల్లాల జడ్జీలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, వాటిపై విచారణకు సైతం న్యాయమూర్తులు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇవి కూడా కేసుల విచారణ సమయంలో జడ్జీలను ఒకింత ఒత్తిడి వైపు నెడుతున్నాయి. 4 నిమిషాలకో కేసు! హైకోర్టు రోజుకు 5 గంటల పాటు పనిచేస్తుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, భోజన విరామం తర్వాత తిరిగి 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు. గంటకు 60 నిమిషాల చొప్పున 5 గంటలకు 300 నిమిషాలు. ఈ 5 గంటల సమయంలో న్యాయమూర్తులు ఒక్కొక్కరు సగటున రోజుకు 70 కేసులను విచారిస్తున్నారు. అంటే నాలుగు నిమిషాలకు ఒక కేసు చొప్పున విచారిస్తున్నారు. ఇది అసాధ్యంగా కనిపిస్తున్నా.. న్యాయమూర్తులు ఇలానే పనిచేస్తున్నారు. దీనిని బట్టి న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కేసులను అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే.. మరికొన్ని కేసులను విచారణకు స్వీకరించి కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇస్తుంటారు. మరికొన్నింటిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఇవి కాక అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో కేసులు దాఖలవుతుంటాయి. ఈ కేసుల విచారణకు ఒకసారి అనుమతినిచ్చాక కోర్టు పనివేళలతో నిమిత్తం లేకుండా వాటిని విచారించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కేసుల విచారణకు అత్యధిక సమయం పడుతుంది. న్యాయవాదులు చెప్పే వాదనలను బట్టి కేసుల విచారణ సమయం ఆధారపడి ఉంటుంది. దీంతో ఆ న్యాయమూర్తులపై తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో విచారణకు నోచుకోని కేసులు కాజ్‌లిస్ట్‌లో వెనక్కి వెళ్లిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారం రోజులకు కూడా ఆ కేసులు విచారణకు నోచుకోని పరిస్థితులు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. దీంతో అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులు సదరు న్యాయమూర్తులను తిట్టుకోవడం హైకోర్టులో పరిపాటిగా మారిపోయింది. ఇక తుది విచారణలు చేపట్టే న్యాయమూర్తులు కూడా రోజుకు 10 నుంచి 20 కేసులను విచారిస్తున్నారు. తుది విచారణ కేసులకు అత్యధిక సమయం పడుతుంది. అంతిమంగా ఓ కేసును విచారించాల్సి ఉన్న నేపథ్యంలో అదేస్థాయిలో వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. దీంతో విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది. అయినా న్యాయమూర్తులు వీలైనంత త్వరగానే ఆ కేసులను విచారిస్తున్నారు. -
అలహాబాద్ సీజేగా జస్టిస్ బొసాలే
ఉమ్మడి హైకోర్టు ఏసీజే పదోన్నతిపై బదిలీ * రేపు కొత్త బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ఆయన అలహాబాద్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు. బదిలీ సందర్భంగా ఆయనకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, రిజి స్ట్రార్లు, సిబ్బంది, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మొదటి కోర్టు హాలులో జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ బొసాలే మాట్లాడారు. న్యాయాధికారులు రోడ్లెక్కడం బాధాకరం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాపై నిరసన తెలియచేస్తూ తెలంగాణ న్యాయాధికారులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించడం బాధాకరమని జస్టిస్ బొసాలే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయాధికారులు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణకే అత్యధిక ప్రాధాన్యతని, ఇందుకు విరుద్ధంగా న్యాయాధికారులు వ్యవహరించినందునే వారి పై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు. వ్యవస్థలు మనపై ఆధారపడి మనుగడ సాగించడం లేదని, వ్యవస్థలపై మనమే ఆధారపడ్డామన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. వ్యవస్థపై నమ్మకం ఉంచి ఓపికతో ఉన్నప్పుడు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ పలు సందర్భాల్లో కీలక సలహాలు, సూచనలు చేసి, విధి నిర్వహణలో సాయపడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు వార్షిక నివేదికను విడుదల చేశారు. అంతకుముందు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ, హైకోర్టు సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు జస్టిస్ బోసాలేనే కారణమని కొనియాడారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌ల ద్వారా వేల కేసులను పరిష్కరించిన ఘనత జస్టిస్ బొసాలేకే దక్కుతుందన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జస్టిస్ బొసాలే చేసిన కృషి మరువలేనిదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఘనంగా సన్మానం: అనంతరం ఉమ్మడి రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలో జస్టిస్ బొసాలేకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, అకాడెమీ డెరైక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు సీజేకు సీఎం కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించతలపెట్టిన ఆయుత చండీయాగంలో పాల్గొనవలసిందిగా సీఎం.. చీఫ్ జస్టిస్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీయాగానికి ఇప్పటికే దేశంలోని ప్రముఖులకేకాక, రాష్ట్రంలోని ముఖ్య వ్యక్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితరులను ఇప్పటికే ఆహ్వానించిన కేసీఆర్.. నేడో, రేపో విజయవాడకు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చండీయాగం ఆహ్వాన పత్రికను అందించనున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ బొసాలే
తిరుమల: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బొసాలే శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం జస్టిస్ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేష వస్త్రంతో జస్టిస్‌ను అర్చకులు సత్కరించారు. అనంతరం వకుళామాతను దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఆలయ చరిత్ర, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని జస్టిస్‌కు ఈవో వివరించారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బోసలే
హైదరాబాద్:ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసలే నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బోసలేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో బోసలే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బోసలే
- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం - మే 7న బాధ్యతల స్వీకరణ హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మే ఏడున ఆయన బాధ్యతలు చేపడతారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా 6న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ బోసలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండు నెలలపాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి తరువాత జస్టిస్ బోసలేను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశాలున్నట్లు న్యాయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీజే గుప్తా ఆరునపదవీ విరమణ చేయాల్సి ఉండగా రెండో తేదీ నుంచి నెలరోజుల పాటు హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో ఒకటో తేదీనే ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఆ తరువాత ప్రభుత్వం... కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర లా కమిషన్‌కు చైర్మన్‌గా గుప్తాను ప్రభుత్వం నియమించే అవకాశముంది. దీనిపై ప్రాథమికంగా ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.