ఈ భారం న్యాయమా? | An average of 60 cases per day | Sakshi
Sakshi News home page

ఈ భారం న్యాయమా?

Published Sun, Oct 16 2016 2:07 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

ఈ భారం న్యాయమా? - Sakshi

ఈ భారం న్యాయమా?

- గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో హైకోర్టు జడ్జీలు
- రోజుకు సగటున 60 కేసుల విచారణ
- ఒక వైపు పెద్ద సంఖ్యలో దాఖలవుతున్న కేసులు
- మరోవైపు భారీగా పేరుకుపోతున్న కేసులు
 
 హైకోర్టు న్యాయమూర్తులు పనిభారంతో అల్లాడిపోతున్నారు. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేనంత పని భారాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఇబ్బడిముబ్బడిగా దాఖలవుతున్న కేసులు.. మరోవైపు అదే స్థాయిలో పేరుకుపోతున్న కేసులు జడ్జీలను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. న్యాయమూర్తులే కాదు.. సిబ్బందిది కూడా ఇదే పరిస్థితి. కేసులు దాఖలు చేస్తున్నా విచారణ జాబితాలో వాటికి స్థానం లభించడం లేదని, దాంతో తమ కేసులు విచారణకు రావడం లేదంటూ కోర్టు సిబ్బందిపై అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చిన్నపాటి గొడవలు హైకోర్టులో ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. అనేక సందర్భాల్లో సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చేంత స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. గతంలో హైకోర్టులో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. దీనంతటికీ ప్రధాన కారణం తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడమే!
 - సాక్షి, హైదరాబాద్
 
 38 పోస్టులు ఖాళీ..చరిత్రలో ఇదే తొలిసారి
 హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కేవలం 23. ఏకంగా 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సగానికిపైగా ఖాళీలు ఉండటం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గత రెండున్నరేళ్లలో అంటే 23 అక్టోబర్ 2013 నుంచి 20 మే 2016 వరకు కేవలం ఒక్క జడ్జి పోస్టు మాత్రమే భర్తీ అయింది. జస్టిస్ బొసాలే తాతాల్కిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అప్పటి కొలీజియం పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. అయితే ఆ జాబితా విషయంలో ఇప్పటివరకు తగిన పురోగతి మాత్రం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ పూర్తయినా నియామకాల్లో ఆల స్యం జరుగుతుండంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం ఆలస్యం జరుగుతోందని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నియామకం ఆలస్యం కావడానికి సైతం రాజకీయ జోక్యమే కారణమని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.

 10 లక్షల మందికి 12 మందే..
 తాజా గణాంకాల ప్రకారం దేశంలో జడ్జీలు-జనాభా దామాషా విషయంలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. దేశంలో ప్రతీ పది లక్షల మందికి జడ్జీల సగటు 18 కాగా, తెలుగు రాష్ట్రాల్లో 12 మాత్రమే. అంటే ప్రతీ పది లక్షల మందికి ఉభయ రాష్ట్రాల్లో 12 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోనే మనం 30వ స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం హైకోర్టులో 2.75 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టులో ప్రతిరోజూ దాఖలయ్యే తాజా కేసులు (అడ్మిషన్) 400 నుంచి 500 వరకు ఉంటాయి. ఈ రోజు కేసులు దాఖలు చేస్తే అవి మరుసటి రోజు కేసుల విచారణ జాబితా (కాజ్‌లిస్ట్)లో ఉంటాయి. వీటికి లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసే కేసులు అదనం.

ఈ కేసులన్నింటినీ ఆయా సబ్జెక్టుల వారీగా పలువురు న్యాయమూర్తులకు కేటాయిస్తారు. ఇందులో రిట్ పిటిషన్లు కీలకమైనవి. అడ్మిషన్ కేసులను విచారించే న్యాయమూర్తులు ముందుకు తాజా కేసులతో పాటు గత విచారణ సమయంలో వాయిదా పడ్డ కేసులు కూడా వస్తుంటాయి. ఇలా అన్ని కేసులూ కలిపి ఆ న్యాయమూర్తుల ఒక్కొక్కరి జాబితాలో కనీసం 200 కేసులు ఉంటాయి. అయితే వీటిలో విచారణకు నోచుకునేది 60 నుంచి 80 కేసులు మాత్రమే. ఇది ఒక్కో జడ్జీని బట్టి ఉంటుంది. కొందరు 90 కేసులను కూడా విచారిస్తే.. మరికొందరు 60 కన్నా తక్కువ కేసులను విచారించే పరిస్థితులున్నాయి. సగటున న్యాయమూర్తులు రోజుకు 70 కేసులకు తక్కువ కాకుండా విచారిస్తున్నారు.
 
 ఇళ్ల వద్దా అధ్యయనం
 ప్రతిరోజూ హైకోర్టులో దాఖలయ్యే కేసుల్లో కొన్నింటిని సబ్జెక్టులను బట్టి ఆయా న్యాయమూర్తులు తమ తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొందరు న్యాయమూర్తులు రాత్రి 11.30 గంటల వరకు ఆ కేసులను అధ్యయనం చేస్తున్నారు. మళ్లీ ఉదయం 6 గంటలకు లేచి ఓ గంటన్నర పాటు కేసులను అధ్యయనం చేసి కోర్టుకు వస్తున్నారు. ఈ స్థాయిలో న్యాయమూర్తులు కసరత్తు చేస్తుంటేనే రోజుకు 60 కేసులను విచారించడానికి సాధ్యమవుతోంది.

ఇది కాక తీర్పులను సిద్ధం చేసినప్పుడు దానిని వెలువరించడానికి ముందు తప్పులను సవరించడానికి కూడా న్యాయమూర్తులకు అత్యధిక సమయం పడుతూ ఉంటుంది. సాయంత్రం 4.30 గంటలకు కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాల నిమిత్తం నిత్యం న్యాయమూర్తుల నేతృత్వంలో ఏదో ఒక కమిటీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఇదే సమయంలో ఆయా జిల్లాల జడ్జీలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, వాటిపై విచారణకు సైతం న్యాయమూర్తులు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇవి కూడా కేసుల విచారణ సమయంలో జడ్జీలను ఒకింత ఒత్తిడి వైపు నెడుతున్నాయి.
 
 4 నిమిషాలకో కేసు!

 హైకోర్టు రోజుకు 5 గంటల పాటు పనిచేస్తుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, భోజన విరామం తర్వాత తిరిగి 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు. గంటకు 60 నిమిషాల చొప్పున 5 గంటలకు 300 నిమిషాలు. ఈ 5 గంటల సమయంలో న్యాయమూర్తులు ఒక్కొక్కరు సగటున రోజుకు 70 కేసులను విచారిస్తున్నారు. అంటే నాలుగు నిమిషాలకు ఒక కేసు చొప్పున విచారిస్తున్నారు. ఇది అసాధ్యంగా కనిపిస్తున్నా.. న్యాయమూర్తులు ఇలానే పనిచేస్తున్నారు. దీనిని బట్టి న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కేసులను అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే.. మరికొన్ని కేసులను విచారణకు స్వీకరించి కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇస్తుంటారు. మరికొన్నింటిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంటారు.

ఇవి కాక అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో కేసులు దాఖలవుతుంటాయి. ఈ కేసుల విచారణకు ఒకసారి అనుమతినిచ్చాక కోర్టు పనివేళలతో నిమిత్తం లేకుండా వాటిని విచారించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కేసుల విచారణకు అత్యధిక సమయం పడుతుంది. న్యాయవాదులు చెప్పే వాదనలను బట్టి కేసుల విచారణ సమయం ఆధారపడి ఉంటుంది. దీంతో ఆ న్యాయమూర్తులపై తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో విచారణకు నోచుకోని కేసులు కాజ్‌లిస్ట్‌లో వెనక్కి వెళ్లిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారం రోజులకు కూడా ఆ కేసులు విచారణకు నోచుకోని పరిస్థితులు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. దీంతో అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులు సదరు న్యాయమూర్తులను తిట్టుకోవడం హైకోర్టులో పరిపాటిగా మారిపోయింది. ఇక తుది విచారణలు చేపట్టే న్యాయమూర్తులు కూడా రోజుకు 10 నుంచి 20 కేసులను విచారిస్తున్నారు. తుది విచారణ కేసులకు అత్యధిక సమయం పడుతుంది. అంతిమంగా ఓ కేసును విచారించాల్సి ఉన్న నేపథ్యంలో అదేస్థాయిలో వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. దీంతో విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది. అయినా న్యాయమూర్తులు వీలైనంత త్వరగానే ఆ కేసులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement