సయ్యద్ ముజీబ్‌కు గోల్డ్‌మెడల్ అందిస్తున్న జస్టిస్ రమేశ్ రంగనాథన్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోర్టుల్లో 3 కోట్ల 25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 16 వ ఏడీఆర్ (ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్), ఎఫ్‌డీఆర్ (ఫ్యామిలీ డిస్ప్యూట్ రిసొల్యూషన్) పీజీ డిప్లొమా కోర్సుల పట్టాల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే సుమారు 300 ఏళ్లు పడుతుందన్నారు.
న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు తక్కువగా ఉన్నందున కేసుల పరిష్కారం ఆలస్యమవుతుందని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ప్రతీ రోజు 150 కేసులు పరిష్కరిస్తున్నా అంతకంతకూ పెరుగుతున్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థలో కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏడీఆర్, ఎఫ్‌డీఆర్ కోర్సులు పూర్తిచేసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కోర్టులకు అనుసంధానంగా కేసులు పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
అనంతరం ఏడీఆర్ కోర్సులో 157, ఎఫ్‌డీఆర్ కోర్సులో ఏడుగురికి పట్టాలను అందించారు. ఏడీఆర్ కోర్సులో 2015 బ్యాచ్‌లో పీజీ డిప్లొమాలో ఉన్నత ప్రతిభ కనబరిచిన సయ్యద్ ముజీబ్‌కు గోల్డ్ మెడల్, ప్రవీణ్‌కుమార్‌కు సిల్వర్ మెడల్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్‌లర్ ముస్తఫా, నల్సార్ రిజిస్ట్రార్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment