శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ బొసాలే
తిరుమల: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బొసాలే శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం జస్టిస్ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు.
తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేష వస్త్రంతో జస్టిస్‌ను అర్చకులు సత్కరించారు. అనంతరం వకుళామాతను దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఆలయ చరిత్ర, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని జస్టిస్‌కు ఈవో వివరించారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.