గడువు లోపు పూర్తి చేయలేదు..
♦ అందుకే కాంట్రాక్టులను రద్దు చేశాం
♦ ‘దుమ్ముగూడెం’పై హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావ్ పూలే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టేల్‌పాండ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ఆయా కాంట్రాక్టర్లు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయలేదని, అందువల్లే నిబంధనల మేర కాంట్రాక్టులను రద్దు చేశామని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న పది కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేయలేదని, ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ చేసిన సిఫారసులను అనుసరించి ఆ కంపెనీలపై చర్యలకు ఉపక్రమించామంది.
ఈ విషయంలో పిటిషనర్ అభ్యంతరాలన్నీ ఊహాజనితమైనవంది. పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈ వ్యాజ్యం దాఖ లు చేశారని, అందువల్ల దీన్ని కొట్టేయాలని కోర్టును అభ్యర్థించింది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 8న జారీ చేసిన జీవో 30ని కొట్టేసి, టెండర్లను రీనోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన ఎన్.డోలేంద్రప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు దుమ్ముగూడెం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్ ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని పిటిషనర్ చెబుతున్నారని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రయోజనం అన్నది ఆయా రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుందని ఆయన తెలిపారు. డోలేంద్రప్రసాద్ తన వ్యాజ్యంలో జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలను పేర్కొన్నారని, అవన్నీ తప్పులన్నారు. తాము ప్రాజెక్టును రద్దు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదన్నారు.
ప్రాజెక్టును రద్దు చేసే ముందు 9మంది కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులిచ్చి, వారి వివరణలు తీసుకున్నామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని కాంట్రాక్టర్ల ప్రయోజనాలను ఆశించి దాఖలు చేశారే తప్ప, ప్రజా ప్రయోజనాలను ఆశించి కాదన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు రద్దు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం కాదన్నారు. ఉభయ రాష్ట్రాలకు నీటి పంపిణీ హక్కుల గురించి పిటిషనర్ మాట్లాడుతున్నారని, దీని ప్రకారం ఇది అంతర్రాష్ట్ర జల వివాదం అవుతుందని, అందువల్ల ఈ వ్యాజ్యా న్ని న్యాయస్థానాలు అధికరణ 226 కింద విచారించడానికి వీల్లేదన్నారు. వరదలప్పుడు 165 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికే ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని సుధాకర్ వివరించారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలనికోర్టును కోరారు. వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ నెల 11న విచారించనున్నది.