బిల్లులు ఆపడంలో అర్థమేమిటి?
రిటైర్డ్ సభ్యుల వైద్య బిల్లులపై ఇరు రాష్ట్రాలకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) సభ్యులుగా పదవీ విరమణ చేసిన వారి వైద్యపరమైన బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని, బిల్లులు ఆపడంలో అర్థమేంటని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. భవిష్యత్తులో హైకోర్టు న్యాయమూర్తులకూ ఇలాంటి పరిస్థితే రావచ్చేమోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఏటీ రిటైర్డ్ సభ్యులకు వైద్యపరమైన ఖర్చులకు చెల్లించాల్సిన బిల్లులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం లేదంటూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏపీఏటీ పరిధి నుంచి తాము తప్పుకున్నామని, తమకు బిల్లులతో ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే, పెన్షన్ ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడి నుంచే బిల్లులు పొందాలని ఏపీ ప్రభుత్వం చెబుతోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, రిటైర్డ్ సభ్యుల వైద్యపరమైన ఖర్చుల బిల్లులు మీరే చెల్లించాలి కదా అని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌రెడ్డిని ప్రశ్నించింది. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదో వివరించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.