‘ఫ్లోరైడ్ సమస్య’పై ఏం చేస్తున్నారో చెప్పండి
సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు.. నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతోపాటు, ప్రజలకు రక్షిత నీరు అందేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నల్లగొండకు చెందిన కె.ఎస్.ఎస్.యశస్వి, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా యశస్వి వాదనలు వినిపిస్తూ, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి వివరించారు. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది ఇప్పటి సమస్య కాదని, ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ప్రతివాదులుగా ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.