- ఎంపీల బృందానికి కేంద్ర న్యాయమంత్రి హామీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ ఎంపీలు, అధికారుల బృందానికి హామీ ఇచ్చారు. హైకోర్టు విభజనకు అవసరమైన భవనాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖతోపాటు తెలంగాణ శాసనసభ, శాసనమండలి చేసిన ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఎంపీలు, న్యాయవాదుల జేఏసీ నేతలు కేంద్ర మంత్రికి గురువారమిక్కడ ఆయన నివాసంలో అందజేశారు.
టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష డిప్యూటీ నేత బి.వినోద్‌కుమార్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, బాల్క సుమన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, న్యాయవాద జేఏసీ ప్రతినిధులు రాజేందర్‌రెడ్డి, సహోదర్‌రెడ్డి, మోహన్‌రావు, కొండల్ రెడ్డి, జగత్‌పాల్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చని, తెలంగాణ హైకోర్టు నిర్వహణకు గచ్చిబౌలిలో బహుళ అంతస్తుల భవనాన్ని సమకూరుస్తామని లేఖలో సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో వెంటనే విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని సదానందగౌడ హామీ ఇచ్చారు.
ఆవిర్భావ దినోత్సవానికి హైకోర్టు సిద్ధం: వినోద్
న్యాయమంత్రిని కలసిన అనంతరం ఎంపీలు వినోద్, కవిత, న్యాయవాదుల జేఏసీ నేత మోహన్‌రావు, రాజేందర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. జూన్ 2 నాటికి హైకోర్టు విభజన పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.