ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు హైకోర్టు ఝలక్
సొంతగా ప్రవేశాలు చేసుకోండి.. కానీ ఖరారు చేయడానికి వీల్లేదని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సర ప్రవేశాల విషయంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఉమ్మడి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే డిగ్రీ ప్రవేశాలు కల్పించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమకు అనుకూల ఉత్తర్వులు పొం దలేకపోయాయి. కాలేజీలు సొంతగా ప్రవేశాలు కల్పించుకోవచ్చునన్న హైకోర్టు.. ఆ ప్రవేశాలను మాత్రం ఖరారు చేయరాదని తేల్చి చెప్పింది. ప్రవేశాలు పొందే విద్యార్థుల కు ఈ విషయాన్ని తెలియచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
డిగ్రీ కాలేజీలన్నీ ఆన్‌లైన్ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజునే వసూలు చేయాలంటూ ప్రభుత్వం గత నెల 10న జారీ చేసిన జీవో67ను సవాలుచేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే విధంగా ఈ నెల మొదట్లో కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ టి.సునీల్‌చౌదరి... ఆన్‌లైన్ ద్వారా కాకుండా సొంత ప్రవేశాలు కల్పించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ఉత్తర్వులను చూపుతూ పలు కాలేజీలు వ్యాజ్యాలు వేశాయి. వీటన్నింటిపై జస్టిస్ నవీన్‌రావు విచారణ జరిపారు.
అక్రమాలు, భారీ ఫీజులు...
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రైవేటు డిగ్రీ కాలేజీల ప్రవేశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమన్నారు.ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ తోసిపుచ్చారు. ప్రవేశాల సందర్భంగా పలు కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చిందన్నా రు. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రూ.12వేలను మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఇదే వ్యవహారంలో అంతకు ముందు జస్టిస్ సునీల్‌చౌదరి ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు.