ఖాకీలపై విచారణకు అథారిటీ
నిజాయితీ అధికారులకు భరోసా ఇచ్చేందుకు కమిషన్
- తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పోలీసు అధికారుల అత్యుత్సాహం, అధికార దుర్వినియోగం, అవినీతి తదితర ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ యంత్రాంగం (అథారిటీ) ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకూ లోనుకాకుండా నిజాయితీగా, నిర్భయంగా విధులు నిర్వర్తించేలా పోలీసులకు భరోసా కల్పించేందుకూ ఓ కమిషన్ ఉండాలంది. ఈ మేరకు పోలీసులకు భరోసా కల్పించేందుకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్, వారిపై వచ్చే ఫిర్యాదుల విచారణకు పోలీస్ కంప్లయింట్స్ అథారిటీలను 3 నెలల్లోగా ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది.
కమిషన్‌కు సీఎం లేదా హోంశాఖ మంత్రి చైర్మన్‌గా, డీజీపీ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉంటారని, న్యాయ సేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శిని కమిషన్‌లో సభ్యునిగా చేర్చాలని చెప్పింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అథారిటీకి నేతృత్వం వహిస్తారని, జిల్లా అథారిటీలకు విశ్రాంత జిల్లా న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శిని జిల్లా స్థాయి అథారిటీల్లో సభ్యులుగా చేర్పాలని సూచించింది. అథారిటీ, కమిషన్‌లను ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు సైతం తెలిసేలా ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జస్టిస్ ఎ.రామలింగేశ్వర్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. ‘‘ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కమిషన్, అథారిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశించి పన్నెండేళ్లు దాటినా వీటిని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం’’అని న్యాయమూర్తి అన్నారు. పోలీసు అధికారుల వేధింపులపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి... ఈ మేరకు తీర్పు వెలువరించారు.
సక్రమంగా విధులు నిర్వర్తించకే ఈ పరిస్థితి... ‘‘రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల అవినీతి, అధికార దుర్వినియోగం, దర్యాప్తులో నిర్లక్ష్యం, సివిల్ వివాదాల్లో జోక్యం, పక్షపాత వైఖరి తదితర ఆరోపణలపై హైకోర్టులో నిత్యం 20 నుంచి 25 ఫిర్యాదులు దాఖలవుతున్నాయి. పోలీసులు విధి నిర్వహణ సక్రమంగా చేసి ఉంటే బాధితులు హైకోర్టును ఆశ్రయించేవారు కాదు. ప్రతి దశలో పోలీసుల బాధ్యతను గుర్తు చేయడం న్యాయస్థానాల విధి ఎంతమాత్రం కాదు. ఇటువంటి ఫిర్యాదులతో కోర్టులపై భారం పెరుగుతోంది. పోలీసుల పరితీరు ఎలా ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది’’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
కాగితాల్లోనే కమిషన్...
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు, హైకోర్టు పలు తీర్పులు ఇచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే పోలీసులు నమోదయ్యే కేసుల ను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ 2010 నవంబర్ 6న జీవో జారీ చేసింది. అయితే ఈ కమిటీ ఉన్నట్లు ప్రజలకు తెలియదు. కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన పదేళ్లకు ఏపీ ప్రభుత్వం 2013లో జీవో జారీచేసింది. అయినా ఇప్పటికీ ఈ జీవోను అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అథారిటీ ఏర్పాటుకు ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. 3 నెలల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కమిషన్, అథారిటీలను ఏర్పాటు చేయాలి’’ అని న్యాయమూర్తి ఆదేశించారు.