వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రభోదానంద ఆశ్రమం వద్ద హింసాత్మక ఘటనలతో నెలకొన్న ఉద్రిక్తత సోమవారం అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్‌గుప్తా, ఐజీ రవిశంకర్ అయ్యర్, ఆక్టోపస్ డీఎస్పీ రాధతోపాటు ఆక్టోపస్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమం వద్దకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆశ్రమం వద్దకు వచ్చిన కలెక్టర్ వీరపాండియన్, అధికారుల బృందం ఆశ్రమంలోకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరడంతో భక్తులు శాంతించారు. అనంతరం 20 బస్సుల్లో 500 మంది భక్తులను స్వస్థలాలకు తలించారు. శాంతిభద్రతల సమస్య అదుపులోకి వచ్చిందని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా తో పాటు ఆశ్రమానికి పారా మిలటరీ బలగాలతో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. అంతకుముందు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.